Biryani: హైదరాబాద్‌లో దమ్‌ బిర్యానీ ఒక్కటేనా.. ఇంకా చాలా ఉన్నాయి!

హైదరాబాద్‌ అనగానే గరం.. గరం దమ్‌కీ బిర్యానీ గుర్తొస్తుంది. హైదరాబాదీలు కనీసం వారంలో ఒకసారైనా అయినా బిర్యానీ తినకుండా ఉండలేరు. అందుకే, బావర్చీ.. ప్యారడైజ్‌సహా భాగ్యనగరం వ్యాప్తంగా ప్రతీ గల్లీలోనూ బిర్యానీ హోటళ్లు దర్శనమిస్తాయి. అయితే, ఎప్పుడూ ఈ హైదరాబాద్‌

Published : 24 Oct 2021 15:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ అనగానే గరం.. గరం దమ్‌ బిర్యానీ గుర్తొస్తుంది. హైదరాబాదీలు కనీసం వారంలో ఒకసారైనా అయినా బిర్యానీ తినకుండా ఉండలేరు. అందుకే, బావర్చీ.. ప్యారడైజ్‌సహా భాగ్యనగర వ్యాప్తంగా ప్రతీ గల్లీలోనూ బిర్యానీ హోటళ్లు దర్శనమిస్తాయి. అయితే, ఎప్పుడూ ఈ హైదరాబాద్‌ దమ్‌కీ బిర్యానీయేనా.. కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఆ అవకాశమూ ఉంది. నగరంలో హైదరాబాద్‌ బిర్యానీ కాకుండా రకరకాల బిర్యానీ రుచులు అందించే హోటళ్లూ ఉన్నాయి. అవేంటీ? ఎక్కడున్నాయో చూద్దామా..

లెగ్‌ పీస్‌/జాయింట్‌ పీస్‌ బిర్యానీ..


(ఫొటో: జొమోటో)

లెగ్‌పీస్‌/జాయింట్‌ పీస్‌ బిర్యానీ.. ఈ మధ్యకాలంలో బిర్యానీ ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రెగ్యులర్‌ హైదరాబాద్‌ బిర్యానీలా చికెన్‌ ముక్క, మసాలా గ్రేవ్‌ కలిపి ఇవ్వరు. బగారా రైస్‌.. మసాలా దట్టించిన నోరురించే చికెన్‌ ముక్కలను వేర్వేరుగా వడ్డిస్తారు. మూసాపేట్‌లోని సత్తిబాబు బిర్యానీలో ఇది లభిస్తోంది. ఒక చికెన్‌ బిర్యానీ ఫ్యామిలీ బకెట్‌ ఆర్డర్‌ చేస్తే మూడు నుంచి ఐదుగురికి సరిపోతుంది. అయితే, ఈ హోటల్‌లో డైన్‌ ఇన్‌ అవకాశం లేదు. కేవలం టేక్‌ ఎవే(పార్సల్‌) మాత్రమే. ఈ బిర్యానీ భిన్నంగా, రుచిగా ఉండటంతో కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఎంతలా అంటే ఆర్డర్‌ చేయడానికి బారులు తీరాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 


డొన్నె బిర్యానీ..


(ఫొటో: స్విగ్గీ)

బెంగళూరులో పాపులరైన డొన్నె బిర్యానీ రుచిని హైదరాబాద్‌లోనూ రుచి చూడొచ్చు. చిక్‌పెట్‌ డొన్నె బిర్యానీ పేరుతో కొండాపూర్‌, అత్తాపూర్‌, హిమాయత్‌ నగర్‌, మాదాపూర్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌, తిరుమలగిరి, మియాపూర్‌, మణికొండ, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో హోటల్స్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడి బిర్యానీకి బాస్మతి బియ్యం కాకుండా జీరా సాంబా/చిట్టి ముత్యాలు బియ్యాన్ని ఉపయోగిస్తారు. దట్టంగా గరం మసాలా, కొత్తిమీర, పూదీన వేసి.. చికెన్‌ ముక్కలను కలిపి ఘుమఘుమలాడే డొన్నె బిర్యానీని తయారు చేస్తారు. డొన్నె ఆకులతో తయారుచేసిన పాత్రల్లో వడ్డిస్తారు కాబట్టే దీనికి డొన్నె బిర్యానీ అని పేరొచ్చింది. మరి మీకూ వీటి రుచి చూడాలనుందా.. మరెందుకు ఆలస్యం వెళ్లి ఒక పట్టుపట్టండి.


ఫ్రైడ్‌ పీస్‌ చికెన్‌ బిర్యానీ


(ఫొటో: స్విగ్గీ)

సాధారణంగా చికెన్‌ బిర్యానీలో ఒక చికెన్‌ పీస్‌ మాత్రమే వస్తుంది. కానీ ఫ్రైడ్‌ పీస్‌ చికెన్‌ బిర్యానీలో దట్టంగా మసాలా దట్టించిన కొన్ని చికెన్‌ ముక్కలను వడ్డిస్తారు. పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌సహా పలు రెస్టారెంట్లలో ఈ బిర్యానీ లభిస్తోంది.


మండీ బిర్యానీ


(ఫొటో: స్విగ్గీ)

బిర్యానీల్లో మండీ బిర్యానీ చాలా ప్రత్యేకం. ఈ మండీ బిర్యానీ యెమెన్‌లోని అరబ్‌ల సంప్రదాయ వంటకం. అయితే.. గత దశాబ్దం నుంచే హైదరాబాదీ ప్రజలు ఈ మండీ బిర్యానీ రుచి చూస్తున్నారు. ఈ బిర్యానీ కోసం ప్రత్యేకమైన మసాలాలు ఉపయోగిస్తారు. బిర్యానీ, చికెన్‌/మటన్‌ను వేర్వేరుగా ప్రత్యేక పద్ధతుల్లో వండుతారు. పెద్ద ప్లేటులో బిర్యానీ.. దానిపై మాంసం ముక్కలు అందంగా అలంకరించి.. వడ్డిస్తారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు రెస్టారెంట్లలో ఈ మండీ బిర్యానీ లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని