Health: ఐవీఎఫ్‌ అయితే శస్త్ర చికిత్స తప్పదా..?

ఐవీఎఫ్‌ పద్ధతిలో పిల్లలను కనాలంటే శస్త్రచికిత్స తప్పదా..? ఐవీఎఫ్‌తో కవల పిల్లలు పుడుతారా..? వయస్సు ఎక్కువైతే కష్టమవుతుందా..? ఇలాంటి చాలా ప్రశ్నలు పిల్లలు కావాలనుకునే వారిలోనూ, వారి బంధువుల్లోనూ వస్తాయి.

Published : 29 May 2022 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐవీఎఫ్‌ పద్ధతిలో పిల్లలను కనాలంటే శస్త్రచికిత్స తప్పదా..? ఐవీఎఫ్‌తో కవల పిల్లలు పుడుతారా..? వయస్సు ఎక్కువైతే కష్టమవుతుందా..? ఇలాంటి చాలా ప్రశ్నలు పిల్లలు కావాలనుకునే వారిలోనూ, వారి బంధువుల్లోనూ వస్తాయి. చాలా మంది శస్త్ర చికిత్సకు వెళ్లడంతో అదే నిజమనుకుంటున్నారు. ఐవీఎఫ్‌ పద్ధతిపై వస్తున్న అనుమానాలు, సమస్యలపై ఫెర్టిలిటీ సర్జన్‌ చంద్రారెడ్డి పలు వివరాలు తెలిపారు.

కాన్పులకు తప్పదా: సహజ గర్భానికి, ఐవీఎఫ్‌ గర్భానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఎలా గర్భం దాల్చారనే విషయం తప్పా వైద్యం అంతా ఒక్కటే. ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భం దాల్చిన మహిళ సాధారణ ప్రసవానికి వెళ్లొచ్చు. ఆరోగ్య పరమైన, వయస్సుకు సంబంధించిన సమస్యలుంటే ఆపరేషన్‌కు వెళ్లాలి. కొంతమంది తొలికాన్పు కదా ఇబ్బందులు ఎందుకని ఆలోచన చేస్తారు. అంతేతప్పా ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం అంతగా రాదు. యువ దంపతులకు ఐవీఎఫ్‌ అవసరం రాదు. వయస్సు మించిపోయిన వారే ఎక్కువ మంది ప్లానింగ్‌ చేసుకుంటారు. 

ఏ జాగ్రత్తలు అవసరం: ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులుండవు. నొప్పి కూడా తక్కువ. అండం సేకరించే సమయంలోనే మత్తు మందు ఇస్తారు. ఆ తర్వాత బెడ్‌రెస్టు తీసుకోవాల్సిన అవసరం కొంతమందికి మాత్రమే వస్తుంది. మందుల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. వయస్సు ఎక్కువ ఉన్న వారికి డోనర్‌ నుంచి అండం తీసుకోవాల్సి వస్తే ఖర్చు పెరుగుతుంది. క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉందనే దానిపై పరిశీలన జరిగినా ఎలాంటి అనుమానాలు రాలేదు. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని తేలింది. 

స్థూలకాయం ఉంటే ఇబ్బందులా: అధిక బరువున్న మహిళలకు పాలిసిస్టిక్‌ ఓవరీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాన్నించి మధుమేహం, థెరాయిడ్‌ రావొచ్చు. హర్మొనల్‌ తేడా వస్తుంది. టెస్టోస్టిరాన్‌ పెరిగి అండం విడుదల కాకపోవచ్చు. వీరికి ఐవీఎఫ్‌ చేసినా విఫలం కావచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని