Covid-19 vaccine: కొవిడ్‌ టీకా గర్భధారణపై ప్రభావం చూపుతుందా?

కరోనా టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా? గర్భవతి అయ్యే అవకాశాలను తగ్గిస్తుందా? గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా? వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. ...

Updated : 12 Aug 2021 12:22 IST

వాషింగ్టన్‌: కరోనా టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా? గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా? గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా? వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవేవీ నిజం కాదని అంటున్నారు వైద్య నిపుణులు. అవన్నీ అపోహలేనని స్పష్టం చేస్తున్నారు.

కొవిడ్‌ టీకా వల్ల గర్భధారణపై ఎలాంటి జీవ సంబంధ ప్రభావాలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ఎవరికైనా సందేహాలు ఉంటే నిజాలేంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఫైజర్‌ అధ్యయనాన్ని ఉదహరిస్తున్నారు.

ఒక అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు ఫైజర్ టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు. టీకాలు తీసుకుంటే స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. టీకాలు సంతాన సౌభాగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, గైనకాలజిస్టు డాక్టర్‌ మేరీ జేన్‌ మిన్‌కిన్‌ అన్నారు.

సాధారణ మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని, ప్రాణవాయువు అవసరం ఎక్కువగా ఏర్పడుతోందని సీడీసీ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే వారు వ్యాక్సిన్‌ తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. టీకాలు తీసుకున్న వేలాది మంది గర్భవతులతో సీడీసీ మాట్లాడింది. మహమ్మారికి ముందున్నట్టుగానే ఇప్పుడూ గర్భవతుల సంఖ్య ఉందని కనుగొంది. అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు నిర్భయంగా కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలని, ఆలస్యం చేయొద్దని ఇమోరి యూనివర్సిటీ గైనకాలజీ శాఖ చీఫ్‌, డాక్టర్‌ డెనిస్‌ జేమిసన్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని