Updated : 10 Aug 2022 11:14 IST

Health; రోజుకు 8 గ్లాసుల నీరు తప్పక తాగాలి సుమా

ఇంటర్నెట్‌డెస్క్‌: మంచినీరు శరీరానికి దివ్య ఔషధం. ఉదయం నీటితో పని ఆరంభించినట్లయితే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎండాకాలంలో నీటిని తక్కువగా తాగితే వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కాదు..అందుకే పెద్దలు, వైద్యులు కూడా నీటి అవసరాన్ని నొక్కి చెబుతారు. ఈ నీటి వినియోగంలోనూ రకరకాల అనుమానాలున్నా..దీనితో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. చక్కగా రోజుకు 8 గ్లాసుల నీటిని తాగినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని జనరల్‌ ఫిజిషియన్‌ రామ్‌కుమార్‌ పేర్కొంటున్నారు.

నీరు ఎందుకు అవసరం: ప్రకృతి ప్రతి ప్రాణి జీవించడానికి ప్రసాదించిన వరం నీరు. మన శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది. నీరు కణజాలం, రక్తంలోనూ, ఎముకల జాయింట్స్‌లోనూ,జీర్ణకోశంతో పాటు శరీరంలోని ప్రతి భాగంలోనూ ఉంటుంది. శరీరంలోని అన్ని రకాల మలినాలను తొలగిస్తుంది.

రోజుకు ఎంత నీరు తాగాలి: వయోజన పురుషులు రోజుకు 3.7 లీటర్ల నీటిని తాగాలి. మహిళలు 2.7 లీటర్ల నీటిని తాగితే చాలు. ఖచ్చితంగా ఇంత తాగాలని చెప్పడం కష్టం..అందుకే రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తాం. మనం తీసుకునే ఆహారంలో కూడా 20 శాతం నీరు ఉంటుంది. కాఫీ, టీ, మజ్జిగలో కూడా నీరు లభిస్తుంది. 

నీరు సరిగా తాగకపోతే ఏమవుతుంతో తెలుసా: తాగుతున్న నీరు శరీరానికి సరిపోతుందా లేదో తెలుసుకోవాలి. నీరు సరిగా తాగకపోతే దాహం వేస్తుంది. లేకపోతే మూత్రం వాసనతో ఉండి పచ్చగా వస్తుంది. సాధారణంగా తెలుపు, పలచని పసుపు రంగులో ఉంటుంది. నీటి శాతం తగ్గిపోతే డీహైడ్రేషన్‌, స్కిన్‌టర్గర్‌, మలబద్దకం కూడా వచ్చినపుడు నీటిని ఎక్కువగా తాగాలని అర్థం చేసుకోవాలి. 

నీటిని అతిగా తాగితే ప్రమాదమా: నీటిని అతిగా తాగితే అతి కొద్ది మందిలో మాత్రమే సమస్యలు వస్తాయి. ఎక్సర్‌సైజ్‌ చేస్తూ అదే పనిగా నీటిని తాగుతుంటారు. వాళ్లు ఒక భ్రమలో ఉంటారు. ఎంత తాగినా సరిపోవనే భావనతో తాగేస్తారు. కొంతమంది మానసిక సమస్యతో పదేపదే నీటిని తాగుతారు. ఇటువంటి వారిలో సోడియం తగ్గిపోతుంది.

ఉదయం నీరు తాగడం మంచిదేనా: ఉదయం నీటిని తాగడంతో ఎంతో మంచిది. ఆరోగ్యకరం కూడా. ఉదయం పూట రెండు గ్లాసుల నీటితో మలినాలు తొలగిపోతాయి. చెడు బ్యాక్టీరియా వెళ్లిపోతుంది. 

భోజనానికి ముందు, తర్వాత నీరు తాగొద్దా: భోజనానికి ముందు, తర్వాత, మధ్యలో నీరు తాగొద్దని చెప్పడం అపోహ మాత్రమే. ఇటీవల ఓ పరిశోధన చేశారు. అందులో కొంతమందికి భోజనానికి అరగంట ముందు అరలీటరు నీటిని తాగించారు. మూడు వారాల తర్వాత పరిశీలిస్తే..వాళ్లు బరువు తగ్గినట్టు తేలింది. సైడ్‌అఫెక్టులు ఏమీ ఉండవు. భోజనం మధ్యలో నీటిని తీసుకుంటే అసిడిటీ వస్తుందనే అనుమానం ఉంటుంది. ఇది సరికాదు. 

కొన్ని జబ్బులున్నవారు ఎక్కువ నీరు తాగకూడదా: గుండె సంబంధిత జబ్బులున్నవారు కాస్త నీటిని తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ సమస్యలున్నవారు., డయాలసిస్‌పై ఉన్న వారు నీటిని తక్కువగా తాగాలి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని