Twins : కవలల్లో తొలి శిశువు మృతి.. 52 రోజుల తర్వాత రెండో బిడ్డ పుట్టింది!

ఒడిశా రాష్ట్ర వైద్య చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కవలలకు జన్మనివ్వాల్సిన ఓ గర్భిణి 23 వారాలకే ఓ మృత శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 52 రోజులకు ఆమెకు మరో పండంటి మగబిడ్డ పుట్డడం సంచలనంగా మారింది.

Published : 08 Jan 2023 14:01 IST

కటక్‌ : ఒడిశా రాష్ట్ర వైద్య చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కవలలకు జన్మనివ్వాల్సిన ఓ గర్భిణి 23 వారాలకే ఓ మృత శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 52 రోజులకు ఆమెకు మరో పండంటి మగబిడ్డ పుట్డడం విశేషం.

కటక్‌ జిల్లా కెండుపట్నాకు చెందిన పార్వతి బెహరా(31) ఓ ఐవీఎఫ్‌ సెంటర్‌లో చికిత్స చేయించుకుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆమె గర్భంలో రెండు పిండాలు ఏర్పడ్డాయి. 23 వారాల తర్వాత(అక్టోబర్‌ 29న) నొప్పులు రావడంతో కేసు తీవ్రతను ఐవీఎఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు గుర్తించి భువనేశ్వర్‌లోని కలింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌  మెడికల్‌ సైన్సెస్‌(కిమ్స్‌)కు సిఫారసు చేశారు. దీంతో అక్కడి వైద్యులు(doctor) ఆమెకు వైద్యం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే దురదృష్టవశాత్తూ గర్భంలోని కవలల్లో ఒక శిశువు(baby) మృతిచెందింది. ఆ పిండాన్ని తొలగించారు. అప్పటికి ఆ బిడ్డ బరువు కేవలం 550 గ్రాములు మాత్రమే ఉంది. దీంతో మరో శిశువును క్షేమంగా బతికించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓ వైపు ఆ గర్భిణి మధుమేహంతో బాధపడుతోంది. మరో వైపు ఒబెసిటీ, హైపోథైరాయిడ్‌ వంటి ప్రతికూల అంశాలు కూడా తోడయ్యాయి. అయినప్పటికీ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చికిత్స చేశారు. దీంతో పార్వతి డిసెంబరు 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ(birth) 1370 గ్రాములు మాత్రమే ఉండటంతో చిన్నపిల్లల వార్డులో 48 గంటలపాటు ఆక్సిజన్‌ అందించారు. కొన్ని రోజులపాటు ముక్కుతో మాత్రమే ఆహారం ఇచ్చారు. బిడ్డ బరువు పెరగడం, ఆరోగ్యంగా ఉండటంతో తర్వాత నోటి ద్వారా ఆహారం ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మన దేశంలో ఇలాంటి ఘటనలు రెండు, మూడు మాత్రమే చోటు చేసుకోగా.. ఒడిశాలో జరగడం ఇదే ప్రథమం అని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని