లాక్‌డౌన్‌లో పెరిగిన గృహహింస ఫిర్యాదులు!

దేశంలో గతేడాది మహిళలపై గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు భారీగా పెరిగినట్లు జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక పేర్కొంది. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఫిర్యాదులు పెరిగినట్లు వెల్లడించింది.

Updated : 27 Mar 2021 12:21 IST

దిల్లీ: దేశంలో గతేడాది మహిళలపై గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు భారీగా పెరిగినట్లు జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక పేర్కొంది. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఫిర్యాదులు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఏడాది కూడా అదే తీరు‌ కొనసాగవచ్చని ఎన్‌సీడబ్ల్యూ అభిప్రాయపడింది.

ఎన్‌సీడబ్ల్యూ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. మహిళలపై నేరాలకు సంబంధించి 2019లో మొత్తం 19,730 ఫిర్యాదులు రాగా, 2020లో ఆ సంఖ్య 23,722కు చేరింది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఎన్‌సీడబ్ల్యూకు ప్రతినెలా 2వేలకు పైగా మహిళలపై వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో 25శాతం గృహహింస కేసులే ఉన్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి మార్చి 25 వరకు 1,463 గృహ హింస కేసులు వచ్చాయి. అయితే లాక్‌డౌన్‌లో ఫిర్యాదుల సంఖ్య పెరగడంతో ఎన్‌సీడబ్ల్యూ ఓ వాట్సాప్‌ నంబర్‌ను కూడా ప్రారంభించింది.

గతేడాది మార్చిలో కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లకు పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో చాలా మందిలో ఆర్థికంగా అభద్రతాభావం, ఒత్తిడి పెరగడం, ఆర్థికపరమైన ఆందోళన వంటి అంశాలు గృహహింసకు దారి తీసినట్లు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్‌లో భార్యాభర్తలతో పాటు, పిల్లలకు ఇళ్లే పనిప్రదేశంగా మారింది. దీంతో మహిళలకు తమ ప్రొఫెషనల్‌ కెరీర్‌తో పాటు, ఇంటిపని బాధ్యతలు కూడా మీద పడ్డాయి’ అని రేఖా తెలిపారు.  మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మాట్లాడుతూ.. ‘గతంలో మహిళలు వారి మనోవేదనను అణచివేసుకునే వారు. ప్రస్తుతం మహిళల్లో అవగాహన పెరగటం వల్లే.. ఫిర్యాదుల రేటు కూడా పెరిగిందని’ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని