
Rishad Premji: కలతగా ఉన్నప్పుడు ఈ పని చేయకండి..!
ముంబయి: విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ నెటిజన్లకు ఒక జీవితానుభవాన్ని వెల్లడించారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో చేయకూడని ఒక ముఖ్యమైన విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. ‘భావోద్వేగాలతో నిండి ఉన్నప్పుడు, కలత చెందినప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నా వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో దాన్నే అనుసరించేందుకు ప్రయత్నిస్తాను’ అని రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్ చేశారు.
రిషద్ ప్రేమ్‌జీ 2019 నుంచి విప్రో ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి అజీమ్ ప్రేమ్‌జీ నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. అలాగే అత్యుత్తమ నాయకత్వం, వృత్తిపరమైన విజయాలు, సమాజం పట్ల ఆయన చూపిన నిబద్ధతతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2014 యంగ్ గ్లోబల్ లీడర్‌గా సత్కరించింది. ఆయన ఇలాంటి స్ఫూర్తినిచ్చే ట్వీట్లు చేయడం కొత్తేం కాదు. నాయకత్వం, పనితీరుకు సంబంధించి ఆయన ఇటీవల ఓ మాట చెప్పారు. ‘నాయకత్వాన్ని పనితీరుతో ముడిపెట్టొద్దు. మీరు గొప్ప నాయకుడు కాకపోయినా..అద్భుతమైన పనిమంతులు కాగలరు’ అంటూ వెల్లడించారు.