రైతుల ఆదాయం రెట్టింపు కోసమే..సాగు చట్టాలు!

తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Updated : 18 Jan 2021 05:28 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటన

బెంగళూరు: తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని అనేక రెట్లు పెంచుతుందని మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలోని కేరకల్‌మట్టి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్‌ షా ప్రసంగించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ పెంచడంతో పాటు వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచామని అమిత్‌ షా వెల్లడించారు. అంతేకాకుండా రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను ఆయన ఉదహరించారు. ముఖ్యంగా రైతులకు ప్రయోజనకరమైన ఆర్థిక సాయం(కిసాన్‌ సమ్మాన్‌ యోజన), ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన ..తదితర పథకాలను వివరించారు.

ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో రైతులు నిరసన చేపడుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని రైతులు చెబుతుంటే.. వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని మరోవైపు కేంద్రం కూడా స్పష్టంచేస్తోంది. అయితే, రైతులకున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రైతుల్లో చర్చలు జరిపింది. అయినప్పటికీ ఫలితం తేలలేదు. దీంతో మరోసారి చర్చలను కొనసాగించాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు..రైతుల సమస్యలను వినేందుకు ఓ కమిటీని వేసింది. అయితే, కమిటీ ముందుకు రావడానికి మాత్రం రైతు సంఘాల నేతలు నిరాకరిస్తున్నారు.

ఇవీ చదవండి..
సాగు చట్టాలపై సుప్రీం స్టే
ఆ ముగ్గుర్నీ తొలగించండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని