Ayurveda: డా.పీకే వారియర్‌ కన్నుమూత

కేరళ ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా ప్రసిద్ధి చెందిన డా.పన్నియంపిల్లి కృష్ణన్‌కుట్టి వారియర్‌(100) శనివారం కన్నుమూశారు.

Published : 10 Jul 2021 20:48 IST

మళప్పురం: కేరళ ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా ప్రసిద్ధి చెందిన డా.పన్నియంపిల్లి కృష్ణన్‌కుట్టి వారియర్‌(100) శనివారం కన్నుమూశారు. ఆయన మరణవార్తను కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కొట్టక్కల్‌ ఆర్య వైద్యశాల(కేఏఎస్‌) మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి చికిత్స అందించారు. ఆయన వద్ద చికిత్స తీసుకున్నవారిలో భారత మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు సహా ఇతర దేశాధ్యక్షులు కూడా ఉన్నారు. 1999లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 1921, జూన్‌ 5న డా.పీకే వారియర్ జన్మించారు. జూన్‌ 8న ఆయన వందో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కొట్టక్కల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన వారియర్‌ తన 20వ ఏట కేఏఎస్‌లో చేరారు. తన 24వ ఏట చదువు పూర్తి కాగానే కేఏఎస్‌ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా తన అమూల్యమైన సేవలతోపాటు కేఏఎస్‌కు అంతర్జాతీయంగా ఆయన మంచి గుర్తింపు తెచ్చారు.

డా.పీకే వారియర్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయుర్వేద వైద్యం విశిష్టతను ఉన్నత శిఖరాలకు ఆయన తీసుకెళ్లారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆయేర్వేదానికి ఆయన చేసిన సేవలు జాతి మరువదంటూ ట్విటర్‌లో మోదీ పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్ తెలిపారు. ఆయన మృతి వైద్య రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కృషి వల్లే ఆయుర్వేద వైద్యానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందని సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. కేరళలో ఆయర్వేద వైద్యానికి ఆద్యుడిగా ఆయన్ను పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ఎంబీ రాజేశ్‌, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌, కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితల, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని