Updated : 17 Oct 2020 11:48 IST

స్వర్ణకవచాలంకృత రూపంలో బెజవాడ దుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తుల శ్రీనివాసులు, ఈవో సురేష్‌బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. స్వర్ణకవచాలంకృత రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాల మొదటి రోజు కావడంతో ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాదికాలన్నీ పూర్తి చేసి 9గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. 

ముందుగా జారీ చేసిన టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. దాదాపు  4వేల మంది పోలీసులు ఉత్సవాల భద్రతలో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు వెయ్యి మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఈవో సురేష్‌బాబు వెల్లడించారు. దేవస్థానంలో ఏటా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగాలను కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా భక్తుల పరోక్ష భాగస్వామ్యంతో రుత్వికులు నిర్వహిస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్‌ అజాద్‌ను దేవాదాయ శాఖ నియమించింది. మీడియా కోర్డినేటర్‌గా సీతా డైరెక్టర్‌ రామచంద్రరావును నియమించారు.

మూడు క్యూలైన్లలో దర్శనాలు..

కొండ దిగువన వినాయక ఆలయం దగ్గర నుంచి క్యూలైన్లు ఆరంభమవుతాయి. కొండ దిగువన మూడు క్యూలైన్లుగా ఆరంభమై.. పైకి వచ్చాక ఓం టర్నింగ్‌ వద్ద ఐదు లైన్లుగా విడిపోతాయి. అక్కడి నుంచి ఉచిత, రూ.100, రూ.300 లైన్లలో భక్తులు దర్శనాలకు వెళతారు. అమ్మవారి దర్శనం చేసుకున్నాక.. మెట్ల మార్గంలో కిందకు వచ్చేస్తారు. కింద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అన్నదానం ఏర్పాటు చేయలేదు.

నిబంధనలు పాటిస్తూ రావాలి..

దర్శనాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలి. చేతులకు గ్లౌజులు ఉండాలి.
 క్యూలైన్లలో సామాజిక దూరం పాటించేలా గీసిన వృత్తాలలో నిలబడి వెళ్లాలి. ● భక్తులు వారు తాగే నీటిని బాటిల్‌లో తెచ్చుకోవాలి. 
పది సంవత్సరాల లోపు, 65ఏళ్లు పైబడిన వాళ్లు, దివ్యాంగులకు అనుమతి లేదు.
టిక్కెట్టు ప్రింటు తీసుకుని కేటాయించిన సమయం కంటే 15 నిమిషాల ముందు రావాలి.
ఆలయ లిఫ్టు, బస్సు సౌకర్యం ఉండదు. ఘాట్‌రోడ్డులో దారి పూర్తిగా నిలిపేస్తారు.● భక్తుల సామగ్రి దాచుకునేందుకు క్లోక్‌రూంలు కొండ దిగువన రథం సెంటర్‌ దగ్గరే ఉంటాయి.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని