AP DGP: ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

Updated : 20 Jun 2024 02:19 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (Nirabh Kumar Prasad) బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  

తొలుత ద్వారకా తిరుమలరావు కర్నూలు ఏఎస్పీగా, అనంతరం కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా, నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీగా ఆయన విధులు నిర్వహించారు. అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని