క్యాంపస్‌లవైపు.. ఈ-కామర్స్‌, స్టార్టప్‌ సంస్థల చూపు!

కరోనా సంక్షోభం అనంతరం ఈ-కామర్స్‌, స్టార్టప్‌ సంస్థలు బాగా పుంజుకున్నాయి. దీంతో తమ పరిధిని మరింత విస్తరించే క్రమంలో ఆయా కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఉన్న ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసి ఎక్కువ జీతం ఇచ్చే సంస్థలవైపు వెళ్తుండటంతో కంపెనీల్లో

Published : 27 Nov 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం అనంతరం ఈ-కామర్స్‌, స్టార్టప్‌ సంస్థలు బాగా పుంజుకుంటున్నాయి. దీంతో తమ పరిధిని మరింత విస్తరించే క్రమంలో ఆయా కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఉన్న ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసి ఎక్కువ జీతం ఇచ్చే సంస్థలవైపు వెళ్తుండటంతో కంపెనీల్లో ఉద్యోగుల కొరత ఏర్పడుతోంది. దీంతో అనుభవజ్ఞులను పక్కనపెట్టి ఇకపై ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. అందుకే, అమెజాన్‌, మీషో, ఇన్‌ఫ్రా మార్కెట్‌, అర్బన్‌ కంపెనీ, గుడ్‌ గ్లామ్‌ తదితర కంపెనీలన్నీ క్యాంపస్‌ ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. శిక్షణతోపాటు మంచి వేతనం ఇవ్వనున్నట్లు సంస్థలు చెబుతున్నాయి.

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వచ్చే ఏడాది చదువు పూర్తిచేసుకుంటున్న విద్యార్థులకు అన్ని విభాగాల్లోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఎస్‌బీ సహా ఇతర ఇంజినీరింగ్‌.. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కాలేజ్‌లలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతామని అమెజాన్‌ ప్రతినిధులు తెలిపారు.

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ వచ్చే ఆరు నెలల్లో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఫోన్‌పే ఈ ఏడాది చివరి నాటికి కనీసం 200 మందిని క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోనున్నట్లు వెల్లడించింది. మీషో, గుడ్‌ గ్లామ్‌ సంస్థలు కూడా 2022లో గతంలో కంటే ఎక్కువ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నటు సమాచారం. ప్రధానంగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారిని నియమించుకోనున్నట్లు మీషో చీఫ్‌ హెచ్‌ఆర్‌ అధికారి ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. పెరుగుతున్న జీతాలు, శిక్షణ.. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా.. ప్రతిభ ఉన్న కొత్తవారిని నియమించుకొని శిక్షణ ఇవ్వడానికే కంపెనీలు మొగ్గు చూపుతుండటం విశేషం.

Read latest General News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని