
గద్దతో గేమ్ అంత ఈజీ కాదు!
‘శత్రువుని భుజబలంతో ఢీకొట్టడం సాధ్యం కానప్పుడు.. బుద్ధి బలంతో ఢీకొట్టాలనేది’ సామెత. గద్దలను పరిశీలిస్తే ఈ సామెత నిజమని మనకు అర్థమవుతుంది. కాళ్లు, రెక్కల్లో అమితమైన సామర్థ్యం గల గద్ద పెద్ద ప్రాణులకు సైతం గాల్లో నుంచే వణుకు పుట్టించగలదు. అంతటి శక్తి సామర్థ్యాలు గల ఆ జీవులు ఒక్క పక్షితో మాత్రం నేరుగా పోరాడలేక.. తెలివితో ఢీకొట్టి ఓడిస్తాయి. ఆ పక్షి పేరే డ్రోంగో. ఇంతకీ ఈ డ్రోంగో పక్షి గద్దల్ని పెట్టే ఇబ్బంది ఏంటి.. మరి గరుడలు వాటిపై తెలివిగా ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయి.. అనే విషయాన్ని తెలుసుకుందాం. (డ్రోంగోలను తెలుగునాట పసళ్ల పోలిగాడు లేదా ఎట్రింజా అని పిలుస్తుంటారు. ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు.)
ఏమిటీ డ్రోంగో
గద్దతో పోలిస్తే డ్రోంగో పక్షి దాని శరీరాకృతిలో పావు భాగం కూడా ఉండదు. కానీ అవి గద్ద మెడపై వాలి వాటికి చిరాకు తెప్పిస్తాయి. అయినప్పటికీ గద్దలు వాటిని ఏం చేయలేవు. ఎందుకంటే అవి మెడపై వాలిపోతాయి కాబట్టి.. కాళ్లతో గద్దంచడానికీ రాదు.. రెక్కలతో తరమడానికీ సాధ్యం కాదు. కాబట్టి అదే అదనుగా డ్రోంగోలు గద్దలపై ఎక్కి రెచ్చిపోతాయి.
గద్ద ప్రతీకారం ఇలా..
తన మెడపై వాలి గోర్లతో రక్కుతూ కోపం తెప్పించే ఈ డ్రోంగోలపై గద్దలు వినూత్నంగా పగ తీర్చుకుంటాయి. అందుకోసం అవి పెద్దగా శ్రమించవు. వాటికి వీలైనంత ఎత్తుకు ఎగురుతాయి అంతే. విమానాలు విహరించే స్థాయి కన్నా ఎక్కువ ఎత్తుకు ఆ పక్షిని తీసుకుపోతాయి. తీరా ఆకాశంలో ఆక్సిజన్ అందని ప్రాంతానికి ఎగురుతాయి. దీంతో ఆ పక్షి ఆక్సిజన్ అందక విలవిల్లాడి కిందకు పడిపోతుంది లేక చనిపోతుంది. ఇలా గద్దలు ఎంతో తెలివిగా వ్యవహరించి తమపై వాలే డ్రోంగోలపై పగ తీర్చుకుంటాయి.
- ఇంటర్నెట్డెస్క్