eamcet exam: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.

Updated : 27 Feb 2024 16:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్‌ పరీక్షను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్‌(ఇంజినీరింగ్‌) పరీక్షను ఆగస్టు 4, 5, 6 తేదీల్లో... ఎంసెట్‌(అగ్రికల్చర్‌, మెడికల్‌) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సబిత వివరించారు.

ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు జులైలో పూర్తి చేయాలి

ఇంజినీరింగ్‌, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను జులై మొదటి వారంలో ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను మంత్రి ఆదేశించారు. విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు త్వరగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని అందుకు అనుగుణంగానే జులై 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థుల బ్యాక్‌లాగ్‌లు కూడా జులైలోనే పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. అన్ని పరీక్షలు కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు.

టీఎస్‌ ప్రవేశ పరీక్షలు పరీక్షలు జరగనున్న తేదీలు
ఎంసెట్‌-ఇంజినీరింగ్‌ 4,5, 6, ఆగస్టు 2021
ఎంసెట్‌-అగ్రికల్చర్‌, మెడిసన్‌ 9, 10 ఆగస్టు, 2021
ఈసెట్‌ 3 ఆగస్టు 2021
పీజీఈసెట్‌ 11, నుంచి 14 ఆగస్టు 2021
ఐసెట్‌ 19, 20 ఆగస్టు 2021
లాసెట్‌ 23, ఆగస్టు 21
ఎడ్‌సెట్‌ 24, 25 ఆగస్టు 2021
పాలీసెట్‌ 17 జులై 2021
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని