Eatala Rajender: ధాన్యం కొనుగోళ్లలో భారాస ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఈటల రాజేందర్

అకాల వర్షాల కారణంగా చేతికందిన ధాన్యం నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని.. ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated : 29 Apr 2023 16:47 IST

హుజూరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లలో భారాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలంటే చిన్నచూపని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. వరి మద్దతు ధర రూ.2,020 ఉండగా, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. రూ.1300 నుంచి రూ.1600లకే ధాన్యం విక్రయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారని ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో చేతికందిన ధాన్యం నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ సమయంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ముమ్మరం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు