EC: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్షతప్పదు: ఈసీ

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Updated : 26 Jun 2024 23:28 IST

అమరావతి: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం హెచ్చరించింది. మాచర్ల వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఘటనే  నిదర్శనమని తెలిపింది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ఏపీ హైకోర్టు కొట్టివేయడం, పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో ఈసీ స్పందించింది. రాజ్యాంగ బద్ధంగా శాంతియుతంగా నిర్వహించే ఎన్నికలు విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ వ్యాఖ్యానించింది. 

మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఈవీఎం ధ్వంసం ఘటనకు ముగింపు లభించిందని ఈసీ పేర్కొంది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదన్న విషయం నిరూపితమైందని తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అందుకు అనుగుణంగా ఈ అరెస్టు జరిగిందని స్పష్టం చేసింది. మే 13న జరిగిన పోలింగ్‌ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండల పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్  నెం.202 లో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా.. ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా ఈసీ పేర్కొంది. వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఆదేశించినట్టు ఈసీఐ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని