Pilot Rohit Reddy: ఏ కేసులో నన్ను పిలుస్తున్నారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.. రోహిత్‌ రెడ్డి

 తాండూరు శాసనసభ్యుడు పైలట్‌ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 6 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు.

Updated : 19 Dec 2022 21:46 IST

హైదరాబాద్: తాండూరు శాసనసభ్యుడు పైలట్‌ రోహిత్ రెడ్డి విచారణకు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటలపాటు ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని కోరారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ..  ‘‘మళ్లీ రేపు హాజరు కావాలని ఈడీ అఘధికారులు చెప్పారు. నా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు. నా కుటుంబ వివరాలూ అడిగారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పా. ఏ కేసులో పిలుస్తున్నారనేది ఇప్పటికీ ఈడీ స్పష్టత ఇవ్వలేదు’’ అని వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఈడీ నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని.. దీని కోసం ఒక వారం గడువు ఇవ్వాలని ఆయన పీఏ శ్రవణ్‌ ద్వారా ఈడీ కార్యాలయానికి రోహిత్‌ లేఖ పంపించారు. కానీ గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో ప్రగతిభవన్‌కు వెళ్లిన రోహిత్‌ రెడ్డి తొలుత సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఈ మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సహాయ సంచాలకుడు దేవేందర్‌సింగ్‌ పేరిట శుక్రవారం అధికారులు రోహిత్‌రెడ్డికి సమన్లు జారీ చేశారు. రోహిత్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌తో పాటు.. తనకు, తన కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, కంపెనీ వివరాలు తీసుకురావాలని కోరారు. ఆదాయపన్ను చెల్లింపులతో పాటు, ఇతర క్రయ విక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల  సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని