ED: భారాస ఎమ్మెల్యే నివాసంలో సోదాలు.. రూ.300 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఈడీ వెల్లడి

భారాస ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు.. మైనింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.39కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గుర్తించారు.

Published : 21 Jun 2024 21:12 IST

హైదరాబాద్‌: పటాన్‌చెరు భారాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి .. మైనింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.39కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గుర్తించారు. మొత్తం రూ.300 కోట్ల మైనింగ్‌ అక్రమాలు జరిగినట్టు అధికారులు నిర్ధరణకు వచ్చారు. సంతోష్ శాండ్‌, సంతోష్ గ్రానైట్‌ కంపెనీల ద్వారా ఈ అక్రమాలు జరిగాయని ఈడీ పేర్కొంది.

మైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ రూ.19లక్షల నగదు గుర్తించింది. సోదాలకు సంబంధించి శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్టు తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను  గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించామని, మరి కొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. మహిపాల్‌రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని