Sri sailam: వైభవంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు... పుష్ప పల్లకిపై దేవదేవుల విహారం

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు...

Updated : 27 Feb 2022 22:41 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అలంకారమండపంలో శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు పుష్పపల్లకిలో శ్రీగిరి పురవీధుల్లోకి తరలిరాగా.. వేలాది మంది భక్తులు శివనామస్మరణతో  నీరాజనాలు పలికారు. ఉత్సవం ఎదుట కథాకళి కళాకారుల నృత్య సందడి, ఢమరుక, శంఖునాద విన్యాసాలతో, చెక్కభజనలు, కోలాటాలు, గొరవయ్యల నృత్యాలు, శివకళారూపాలతో కళాకారులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణరాజగోపురం వద్ద నుంచి గంగాధరమండపం, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. శివభక్తులతో ఆలయ వీధులన్నీ నిండిపోయాయి. మరో వైపు మహాశివరాత్రి ఘడియలు దగ్గర పడుతుండటంతో భక్తులు అశేష సంఖ్యలో శ్రీశైలానికి తరలివస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతాలైన నాగులూటి, పెద్ద చెరువు, భీమునికొలను మీదుగా కైలాసద్వారం నుంచి శ్రీశైలం చేరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని