Viral Pics: సైకిల్‌పై భార్య మృతదేహంతో..

దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థలు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి....

Published : 28 Apr 2021 17:32 IST

అంత్యక్రియలకు అనుమతించని గ్రామస్థులు

జౌన్‌పుర్‌: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జౌన్‌పుర్‌ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సోమవారం భర్త ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే రాజ్‌కుమారి మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకొచ్చి వారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకు కొవిడ్‌ సోకినట్లు కూడా వైద్యులు వెల్లడించలేదు.

అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు వృద్ధుడికి గ్రామస్థులు సాయం చేయాల్సింది పోయి.. ఎవరూ ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు.  గ్రామంలోని శ్మశానవాటికలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని తెగేసి చెప్పేశారు. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఆ వృద్ధుడు సైకిల్‌ మధ్యలో భార్య మృతదేహాన్ని ఉంచి గంటల కొద్దీ తిరిగాడు. దిక్కు తోచని స్థితిలో రోడ్డు పక్కన ఆగి గుండెలవిసేలా రోధించాడు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్థానిక అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు.విషయం తెలుసుకున్న జౌన్‌పుర్‌ పోలీసులు రాజ్‌కుమారి మృతదేహానికి రామ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని