
నాడు దేశం కోసం.. నేడు పొట్టకూటి కోసం..
కుటుంబ పోషణకు తంటాలు పడుతున్న మాజీ సైనికాధికారి
హైదరాబాద్: ఒకప్పుడు దేశం కోసం పోరాడిన ఆ సైనికుడు ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు పోరాడుతున్నాడు. తుపాకీ పట్టుకొని దాయాది దేశంతో యుద్ధం చేసిన ఆయన బతుకుబండిని లాగడానికి ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు. ఏడు పదుల వయసులో పొట్టకూటి కోసం కష్టాలుపడుతున్నాడు. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన షేక్ అబ్దుల్ కరీం ఓ మాజీ సైనికాధికారి. తండ్రి ఫరీద్ అప్పటికే ఆర్మీలో ఉండటంతో ఆయన ప్రోత్సాహంతో 1967లో సైన్యంలో చేరారు. ఆపరేషన్ రేడియో ఆర్టిలరీలో గన్నర్‌గా పనిచేశారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. సైన్యంలో తొమ్మిదేళ్లు పనిచేశారు. అయితే పెన్షన్ లభించడం లేదు. ప్రస్తుతం భార్య సుల్తానాతో కలిసి రాజేంద్రనగర్‌లో నివాసముంటున్నారు.
అబ్దుల్ కరీంకు ఆరుగురు సంతానం కాగా వారందరికి వివాహం చేశారు. తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాల్సిన కుమారుల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో రోజు గడవడం కష్టంగా మారింది. రుణం తీసుకొని ఆటో కొనుక్కున్న కరీం ఏడేళ్లుగా రాజేంద్రనగర్ పరిధిలో ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు.
భువనగిరి పరిధిలోని వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామంలో కరీంకు ఐదెకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ దస్తావేజులు ఇవ్వలేదు. ఆ భూమి ఇంకొకరి పేరుతో రిజిస్టర్ చేశారు. దానికి బదులుగా మరోచోట భూమి ఇస్తామన్న అధికారులు స్పందించడం లేదని కరీం వాపోతున్నారు.