Venkaiah naidu: తెలుగు భాష పరిరక్షణకు పునరంకితం కావాలి: వెంకయ్యనాయుడు
తెలుగు భాషా ప్రకాశానికి దివంగత ఎన్టీఆర్ (NTR) మనసావాచా కృషి చేశారని, తెలుగు భాష పరిరక్షణకు నవతరం కంకణ బద్ధులు కావడమే ఆయనకు అర్పించే అసలైన నివాళులని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
హైదరాబాద్: తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ పునరంకితం కావాలని భారత మాజీ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) పిలుపునిచ్చారు. వీధిలో, బడిలో, గుడిలో అన్నిచోట్లా తెలుగు మాట తెలుగువారందరి నోటా వినపడాలని ఆయన కోరారు. తెలుగు భాషా ప్రకాశానికి దివంగత ఎన్టీఆర్ (NTR) మనసావాచా కృషి చేశారని, తెలుగు భాష పరిరక్షణకు నవతరం కంకణ బద్ధులు కావడమే ఆయనకు అర్పించే అసలైన నివాళులని ఆయన అన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ‘ వీధి అరుగు అంతర్జాల వేదిక... శకపురుషునికి శత వసంతాలు’ పేరుతో శనివారం సాయంత్రం ఇంటర్నెట్లో నిర్వహించిన కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు తెలుగు సంఘాలు భాగస్వామ్యం కావడం అభినందనీయమని, ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉన్న ఎల్లలు లేని అభిమానానికి ఇది నిదర్శనమని అన్నారు.
అంతర్జాలంలో అంతర్జాతీయంగా 14 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు వారధి కాగలదని వెంకయ్యనాయుడు చెప్పారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగిన నటుల్లో ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో ఉంటుందని, నిలువెత్తు స్ఫురద్రూపంతో కనిపించే ఎన్టీఆర్ అంటే ప్రజలకు సినిమాకు మించిన అభిమానమని పేర్కొన్నారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి, ప్రత్యామ్నాయ రాజకీయాల మార్గదర్శకుడిగా, ప్రజాభ్యుదయమార్గ నవ్య పథగామిగా ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ప్రజా సంక్షేమం విషయంలో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషిని భావితరాలు గుర్తుంచుకుంటాయన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువలు, భారతీయ తాత్వికత పట్ల అభిమానం ఇలా అన్నింటినీ ఆచరణలో చూపించిన ఎన్టీఆర్ వ్యక్తిత్వం విలక్షణమైనదని కొనియాడారు. తెలుగు భాషపై ఆయన చూపిన మమకారం, తెలుగు భాషా వికాసానికి ఆయన కృషి చేయడంతో ఆయనంటే తనకు మిక్కిలి అభిమానం ఏర్పడిందని చెప్పారు. తెలుగువారంటే దక్షిణాదివారని సాధారణ ముద్ర వేసిన రోజుల్లో తెలుగు వారికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉందని ఎలుగెత్తి చాటి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని గుర్తుచేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పట్ల అభిమానం పాళ్ళు తమ ఇద్దరికీ ఒకింత ఎక్కువే అని, ఆ విషయాన్ని బాహాటంగా చెప్పుకోవడానికి తాము గర్వపడతామని చెప్పారు. తమ ఇద్దరి మధ్య అనుబంధం బలపడటానికి గల కారణాల్లో తెలుగు భాష కూడా ఒకటన్నారు.
సినిమాల్లో అంతులేని ప్రజాభిమానాన్ని చవిచూసిన ఎన్టీఆర్, రాజకీయంగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏమిటన్న విషయాన్ని తొలినాళ్ళ నుంచి తాను ఆసక్తిగా గమనిస్తూ వచ్చానని వెంకయ్యనాయుడు తెలిపారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం సాధించిన వ్యక్తి ఎన్టీఆర్ తప్ప ప్రపంచంలో మరొకరు లేరని చెప్పారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవంతో ఆయన పట్ల అభిమానం కలిగిన వ్యక్తిగా, వారి అభిమానాన్ని పొందగలిగిన ప్రజాప్రతినిధిగా ఆయన ఆలోచనల్లోని చిత్తశుద్ధిని, వారి నిష్కల్మష హృదయాన్ని దగ్గరగా గమనించగలిగానని తెలిపారు. వారి ప్రతి అడుగు స్ఫూర్తిదాయకంగా సాగిందని, ప్రతి విషయాన్ని సునిశితంగా బేరీజు వేసుకుని, ప్రజాస్వామ్య సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ అనేక పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని చెప్పారు. ‘‘సనాతన ఆధ్యాత్మిక విశ్వాసాలతో, హైందవ ధర్మానికి ప్రతీకలా కనిపించే ఎన్టీఆర్ ఓ దృఢమైన జాతీయవాది. దేశభక్తితో పాటు తెలుగు భాష పట్ల అమిత ప్రేమ కలిగిన వ్యక్తి. తెలుగు వాడినంటూ గర్వంగా చెప్పుకున్న తెలుగు రేడు ఆయన. ఎన్టీఆర్ గారి భావన, సంకుచిత వాదానికి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచనకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాన్ని పటిష్ఠపరచాలనే భావనను, ఉన్నతమైన ఆశయంతో సమర్థించారనే విషయాన్ని ముందుతరం రాజకీయనాయకులు గుర్తుంచుకోవాలి.’’ అని సూచించారు.
‘‘ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, జాతీయవాద భావనతో మిళితం చేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళారు. దీనికి కారణం తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆత్మగౌరవం కల్పించడానికి కాదు, ప్రతి భాష, ప్రతి రాష్ట్రం తమదైన ఆత్మగౌరవాన్ని సాధించుకునే విధంగా స్ఫూర్తిని నింపడానికే.’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.
జీవితంలో వారు చేసిన కృషి, సాధించిన విజయాలు, సంపాదించుకున్న ప్రజాభిమానం, ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, అన్నింటికీ మించి వారి వ్యక్తిత్వం నేటి యువతకు, ముందు తరాలకు ఆదర్శనీయమైనవన్నారు. ఎన్టీఆర్ చేసిన కృషిని, సమాజంలో ఆయన తీసుకొచ్చిన ప్రభావవంతమైన సానుకూల మార్పులను భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఒక లెజెండ్ అని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వారి స్ఫూర్తిని ముందు తరాలకు తెలియజేయటంలో కీలక పాత్ర పోషిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ వీధి అరుగు నిర్వాహకులు వెంకట్ తరిగోపుల, ఇతర సమన్వయకర్తలను వెంకయ్యనాయుడు అభినందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను చక్కగా ఆవిష్కరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రం బాగుందని ప్రశంసించారు. రచయితకు, ఈ లఘు చిత్రాన్ని రూపొందించిన ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇంటర్నెట్ వేదికకు ‘వీధి అరుగు’ అని చక్కని పేరు పెట్టారని, పాతతరం విషయాలను ఈ పేరు గుర్తు చేసిందని, ఇప్పుడు వీధి అరుగులు కనపడ్డం లేదని, ఇప్పుడు జీవితమంతా పరుగు అయిందని అన్నారు. కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రముఖ చలనచిత్ర నటుడు, మాగంటి మురళీమోహన్ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
-
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 19,600 పైకి నిఫ్టీ
-
Ashwin: అదృష్టమంటే అశ్విన్‌దే.. అనుకోకుండా మళ్లీ ప్రపంచకప్ జట్టులో!