కరోనా తెచ్చిన కొత్త ముప్పు ఇదే!

దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా చాలా వరకు ఆన్‌లైన్‌ ద్వారానే పనులు ఇంటి నుంచే చక్కబెట్టేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధులు ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనడంతో పిల్లలు, కౌమారదశలో ఉన్నయువకులలో కంటిచూపు, వినికిడి సమస్యలు కలిగి వస్తున్నాయని గురుగ్రామ్ వైద్యులు వెల్లడించారు.

Published : 26 Feb 2021 21:09 IST

గురుగ్రామ్‌: దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా చాలా వరకు ఆన్‌లైన్‌ ద్వారానే పనులను ఇంటి నుంచే చక్కబెట్టేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనడంతో చిన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న యువకులలో కంటిచూపు, వినికిడి సమస్యలు వస్తున్నాయని గురుగ్రామ్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లతో పాటు ఇయర్‌ఫోన్స్‌ ఎక్కువ వాడుతున్న వారిలో కంటి, వినికిడి సమస్యలు పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గురుగ్రామ్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రి హెడ్‌ రాహుల్‌ గార్గ్ మాట్లాడుతూ.. ‘‘వయసుతో పాటు, ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల కంటిచూపు మందగించడం, వినికిడి సమస్యలకు దారి తీస్తోంది. అయితే కొవిడ్‌-19 మహమ్మారికి ముందు కొంతమంది రోగులు దీపావళి పండగ పటాకుల కారణంగా వినికిడి సమస్యలు ఎదుర్కొంటూ ఆసుపత్రులు-క్లినిక్‌లను సందర్శించేవారు. కానీ కొవిడ్‌-19 కారణంగా అన్ని వయసుల వారు వినికిడి, కంటి సమస్యలతో క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. అయితే వీరంతా ఎక్కువగా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను హెడ్‌ఫోన్లలో నిరంతరం అధిక శబ్దంతో వాడటం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 120 డెసిబెల్స్ శబ్దం చెవులకు హానికరం కాగా,  140 డిసిబెల్స్ అయితే చెవులు శాశ్వతంగా దెబ్బతింటాయి. 100 డిసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వల్ల మన శరీర మానసిక ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుందని’’ చెప్పారు.

ఈఎన్‌టీ స్పెషలిస్ట్ యోగేష్‌ గోయల్‌ మాట్లాడుతూ..‘‘చాలామంది ప్రజలు 8 గంటలకు పైగా హెడ్‌ ఫోన్స్ ధరించి ల్యాప్‌టాప్‌ ముందు పనిచేస్తున్నారు. వారి చెవులపై చాలా ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాదు శుభ్రపరచని ఇయర్‌బడ్‌లు లేదా ఇయర్-ప్లగ్‌లు ఇన్‌ఫెక్షన్స్ వ్యాప్తి చెందుతాయి. చెవి లోపలికి స్వచ్ఛమైన గాలి వెళ్లాలంటే ఇయర్‌ ఫోన్స్ తక్కువ వాడాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు అస్సలు హెడ్‌ఫోన్స్ వాడకూడదు. ల్యాప్‌టాప్‌, లేదా వ్యక్తిగత కంప్యూటర్‌లు వాడేటప్పుడు వాటి సౌండ్‌ని చాలా వరకు తగ్గించాలి’’ తెలిపారు. శబ్ధ కాలుష్యానికి కారణమయ్యే కారకాలను అరికట్టాలంటే సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని