Farah Khan: ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలో 4రెట్లు పెరిగిన ‘ఆమె’ ఆస్తులు..!

ఇమ్రాన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఆమె ఆస్తుల విలువ నాలుగు రెట్లు పెరిగినట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది.

Updated : 30 Apr 2022 14:48 IST

తాజా నివేదిక వెల్లడి

ఇస్లామాబాద్‌: తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితులపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల దేశం విడిచి వెళ్లిపోయిన ఇమ్రాన్‌ మూడో భార్య బుష్రా స్నేహితురాలు ఫరాఖాన్‌ (ఫర్హాత్‌ షహ్‌జాదీ, ఫరా గుజ్జార్‌ పేర్లు) ఆస్తులు స్వల్ప కాలంలోనే భారీగా పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇమ్రాన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఆమె ఆస్తుల విలువ నాలుగు రెట్లు పెరిగినట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది. దీంతో ఇమ్రాన్‌ సన్నిహితులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే విషయం తేటతెల్లమవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

‘ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్లలోనే ఫరాఖాన్‌ ఆస్తులు నాలుగు రెట్లు పెరిగాయి. 2017లో ఆమె ఆస్తుల విలువ 231 మిలియన్‌ పాకిస్థానీ రూపాయలు (PKR) ఉండగా.. 2021 వచ్చేసరికి 971 మిలియన్లకు పెరిగింది. ఇక 2018లో ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించలేదు’ అని తాజా నివేదిక పేర్కొంది. లాహోర్‌, ఇస్లామాబాద్‌లో లగ్జరీ ఆస్తులతోపాటు పలు నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో స్థిర ఆస్తులను కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం నివాస స్థలాలే కాకుండా పలు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల్లోనూ ఆమె భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అధికారికంగా వెల్లడించిన ఆస్తుల విలువే మూడేళ్లలో నాలుగు రెట్లు పెరగగా.. అనధికారిక ఆస్తుల విలువ ఇంతకంటే భారీగానే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నల్లధనాన్ని వైట్‌గా మార్చేందుకు 2019లో ఓ ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారనే ఆరోపణలూ ఫరాఖాన్‌పై ఉన్నాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో భార్య బుష్రా బీబీకి ఫరాఖాన్‌ అత్యంత సన్నిహితురాలు. ఇమ్రాన్‌-బుష్రాల వివాహం కూడా ఫరాఖాన్‌ నివాసంలోనే జరిగింది. ఈ సాన్నిహిత్యంతోనే ఇమ్రాన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఫరాఖాన్‌.. అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్రావిన్సులో అధికారులు కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇప్పించి ఆమె భారీ మొత్తంలో డబ్బులు వెనకేసుకున్నారని అలీమ్‌ ఖాన్‌, మరియమ్‌ నవాజ్‌ వంటి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నాయి. ఈ కుంభకోణాన్ని ‘మదర్‌ ఆఫ్ ఆల్ స్కాండల్స్‌’గా అభివర్ణించిన విపక్షాలు.. దీనివిలువ 6 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారం కోల్పోతే తన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే ఆయన సన్నిహితులు ముందస్తుగా దేశం విడిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఫరాఖాన్‌ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు రాగా.. ఆమె భర్త ఇప్పటికే అమెరికా వెళ్లిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని