Biswabhusan Harichandan: గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఏపీ ప్రభుత్వం ఘన వీడ్కోలు

ఛత్తీస్‌గఢ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌(Biswabhusan Harichandan)కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.

Updated : 22 Feb 2023 12:19 IST

విజయవాడ: ఛత్తీస్‌గఢ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (Biswabhusan Harichandan)కు ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్‌కు సీఎం జగన్‌, సీఎస్‌ జవహర్‌ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం గవర్నర్‌ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. 

సుమారు 44 నెలలపాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసేందుకు తనకు సహకరించిన అందరికీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని చెప్పారు. అంతకుముందు బిశ్వభూషణ్‌ దంపతులకు రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది నుంచి తనకు లభించిన సహకారం వల్లే గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర గవర్నర్‌గా ఫలవంతమైన పదవీకాలం కొనసాగిందన్నారు. ముఖ్యంగా కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో తనకు లభించిన సహకారం, మద్దతు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బిశ్వభూషణ్‌కు గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాజభవన్‌ సిబ్బంది జ్ఞాపికను అందజేసి సత్కరించారు. 

మరోవైపు ఏపీకి నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Justice Abdul Nazeer) ఈరోజు రాత్రి 8గంటలకు విజయవాడ రానున్నారు. ఆయనకు సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించి గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని