గొప్పోళ్లయినా.. ఎదురు దెబ్బలు తప్పలేదు! 

ఒక సంస్థ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపించడం అంతా సులభం కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. వినియోగదారులు మెచ్చే ఉత్పత్తులు తయారు చేస్తూ, మెచ్చే సేవలు అందిస్తూ వారికి చేరువైతేనే సంస్థలకు గుర్తింపు లభిస్తుంది. అలా బిల్‌గేట్స్‌,

Updated : 30 Oct 2020 11:37 IST

ఒక సంస్థ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపించడం అంత సులువు కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినియోగదారులు మెచ్చే ఉత్పత్తులు తయారు చేస్తూ, మెచ్చే సేవలు అందిస్తూ వారికి చేరువైతేనే సంస్థలకు గుర్తింపు లభిస్తుంది. అలా బిల్‌గేట్స్‌, జెఫ్‌ బెజోస్‌, స్టీవ్‌ జాబ్స్‌ వంటి అనేక మంది తమ సంస్థలను దిగ్గజ సంస్థలుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా, సంస్థ పరంగా కొన్ని వైఫల్యాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. వాళ్లు చేసిన కొన్ని ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. 


జెఫ్‌ బెజోస్‌

ఆవకాయ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వరకు ఏది కావాలన్నా ఇప్పుడు అమెజాన్‌లో లభిస్తుంది. ఈ ఈ-కామర్స్‌ సంస్థను జెఫ్ బెజోస్‌ 1994లో ప్రారంభించారు. పండగలు, ప్రత్యేక రోజుల్లో వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తూ.. ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న బెజోస్‌కు ఫోన్ల విషయంలో ఓసారి ఎదురుదెబ్బ తగిలింది. అన్ని బ్రాండ్ల ఫోన్లు అమ్ముతున్న తన సంస్థ.. సొంతంగా ఫోన్‌లు ఎందుకు తయారు చేసి అమ్మకూడదని అనుకున్నాడో ఏమో! 2014 జూన్‌లో అమెజాన్‌ ‘ఫైర్‌ ఫోన్‌’ మొబైళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశాడు. ఈ 3డీ ఎనేబుల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్స్‌-రే తీసుకునే వీలుంది. నాలుగు ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాలు, యూజర్‌ కదలికను పసిగట్టే జైరోస్కోప్‌.. టెక్ట్స్‌, వాయిస్‌ను గుర్తుపట్టి యూజర్‌కు కావాల్సిన వస్తువుల్ని అమెజాన్‌ ఆన్‌లైన్‌లో చూపించడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఫోన్‌ డిజైన్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, కొన్ని స్పెసిఫికేషన్స్‌ కేవలం ఏటీ&టీ నెట్‌వర్క్‌కి ప్రత్యేకం కావడం ఫోన్‌కు ప్రతికూలంగా మారాయి. ఈ ఫోన్లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ధర తగ్గించినా అమ్మకాలు పుంజుకోలేదు. దీంతో మరుసటి ఏడాదే అమెజాన్‌ ఫైర్‌ ఫోన్ల తయారీని నిలిపేసింది. 


స్టీవ్‌ జాబ్స్‌

యాపిల్‌ అంటేనే ఒక బ్రాండ్‌. దాంట్లో కొత్త మోడల్‌, వెర్షన్‌ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వినియోగదారులు ఎదురుచూస్తుంటారు. అయితే, 1980లో ఈ సంస్థ యాపిల్‌ 3 పేరుతో ఒక కంప్యూటర్‌ను తయారు చేసింది. అప్పటి యాపిల్‌ చీఫ్‌ స్టీవ్‌ జాబ్స్‌ ఈ కంప్యూటర్‌ నుంచి ఎలాంటి శబ్ధాలు రావొద్దని కూలింగ్‌ ఫ్యాన్‌, వెంటిలేషన్‌ వంటివి లేకుండా చేశారు. వేడెక్కకూడదని కంప్యూటర్‌ డబ్బాను అల్యూమినియంతో తయారు చేశారు. అయినా కంప్యూటర్‌ వేడెక్కింది. కొన్ని సందర్భాల్లో వేడికి కంప్యూటర్‌ లోపల ఉన్న చిప్‌లు, ఫ్లాపీ డిస్క్‌లు కరిగిపోయాయని ఫిర్యాదులొచ్చాయి. దీంతో మార్కెట్లో అప్పటికే విక్రయించిన దాదాపు 14 వేల కంప్యూటర్లను సంస్థ వెనక్కి తెప్పించింది. 1983లో లిసా పేరుతో మౌస్‌తో కూడిన కంప్యూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే అప్పట్లోనే దాని ధర 9,995 డాలర్లు ఉండటంతో కొంతమంది మాత్రమే దానిని కొనగలిగారు. అందరికీ చేరువ కాలేక కొన్నాళ్లకు ఆ కంప్యూటర్ల ఉత్పత్తి నిలిపివేశారు. 1993లో యాపిల్‌ న్యూటన్‌ పేరుతో ఓ డివైజ్‌ను తీసుకొచ్చింది. డివైజ్‌ తెరపై ప్రత్యేకమైన పెన్‌తో రాస్తే.. దాన్ని డిజిటల్‌ టెక్ట్స్‌గా మారుస్తుంది. అయితే సంస్థ అనుకున్న విధంగా న్యూటన్‌ డివైజ్‌ పని చేయలేదు. దీంతో అదీ వైఫల్యం చెందింది. 


బిల్‌గేట్స్‌

1990ల్లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీలో మైక్రోసాఫ్ట్‌కు ఎదురులేదు! అదే సమయంలో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతోంది. కానీ, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆలస్యం చేశారు. ఫలితంగా ఇంటర్నెట్‌ సేవల విషయంలో వెనుకబడ్డారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్‌ను కాదనుకొని మరో పెద్ద పొరపాటు చేశారు. ఓ సందర్భంలో ఆయనే ఈ విషయాన్ని అంగీకరించారు.


మార్క్‌ జుకర్‌బర్గ్‌

జుకర్‌బర్గ్‌ పేరు వినగానే ఫేస్‌బుక్‌ గుర్తొస్తుంది. కానీ, ఆయన 2004లోనే వైర్‌హాగ్‌ పేరుతో ఫైల్‌ షేరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చారు. ఫేస్‌బుక్‌లో ఫొటోలు, ఫైల్స్‌ షేర్‌ చేసుకోవాలంటే ఈ వైర్‌హాగ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, దీనిపై కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటం, ఫొటోలు నేరుగా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసుకునే సదుపాయం రావడంతో వైర్‌హాగ్‌ను మూసేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు