Updated : 19 Aug 2020 19:22 IST

తొలిసారి ఫొటోలో కనిపించిందెవరో తెలుసా?

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. కానీ.. ఆ సమయంలో మనం తీసుకున్న ఫొటోలు నేడు మధుర స్మృతులుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఫొటో దిగాలంటే ఫొటో స్టూడియో వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్‌ ఫోన్లు.. అందులో కెమెరా ఉంటోంది. దీంతో ప్రతి సందర్భాన్ని తీపి జ్ఞాపకంగా మలుచుకునేందుకు ఫొటోలు తీసుకుంటున్నారు. చిటికెలో రకరకాల ఫీచర్లతో ఫొటోలు వచ్చేస్తున్నాయి. ఈ ఫొటోలే లేకపోతే గతాన్ని తలుచుకోవడమే కానీ చూసుకునే భాగ్యం ఉండేది కాదు. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ, కెమెరాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం..

* 18వ శతాబ్దం ముందు నుంచే కళ్లముందు కనిపిస్తున్న దృశ్యాన్ని ఫొటోగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే 1717లో జాన్‌ హెన్రిచ్‌, 1800లో థామస్‌ వెడ్జ్‌వుడ్‌ ఫొటో తీసేందుకు విఫలయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం ఫొటోగ్రఫీకి బాటలు వేసిందనే చెప్పాలి. 1820లో తొలిసారి ఫొటోగ్రఫీ వెలుగులోకి వచ్చింది. కానీ 1839 నుంచే ఫొటోగ్రఫీ ప్రారంభమైనట్లు పరిగణిస్తుంటారు.

* 1838లో లూయిస్‌ డగ్యుర్రె తీసిన ఫొటోలో తొలిసారి మనిషి కనిపించాడు. లూయిస్‌.. పారిస్‌లోని బౌలెవర్డ్‌ డూ ఆలయం, పరిసర ప్రాంతాలను తీయాలనుకున్నాడు. ఫొటో తీయడానికి పది నిమిషాలు పట్టింది. ఆ సమయంలో అక్కడున్న ఇద్దరు వ్యక్తులు ఫొటోలో కనిపించారు. ఒక వ్యక్తి.. అతడి షూస్‌ పాలిష్‌ చేస్తూ మరో వ్యక్తి ఫొటోలో కనిపించారు. అయితే వారి ముఖాలు కనిపించకపోయినా.. ఫొటోలో తొలిసారి కనిపించిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. విచిత్రమేమిటంటే వారు ఈ ఫొటోలో ఉన్నట్లు వారికే తెలియదు.

* ఇప్పుడు మనం సెల్ఫీలంటూ తెగ ఫొటోలు దిగుతున్నాం. కానీ సెల్ఫీని 1839లోనే అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ రాబర్ట్‌ కార్నెలియస్‌ తీసుకున్నాడు. అప్పట్లో ఫొటో తీయాలంటే కొన్ని నిమిషాల పాటు కెమెరా ముందు నిల్చొవాల్సి వచ్చేది. దీంతో రాబర్ట్‌ కెమెరాకు ఉన్న లెన్స్‌ క్యాప్‌ తీసి పరుగుత్తుకెళ్లి.. కెమెరా ముందు నిల్చున్నాడు. అలా తన ఫొటోను తానే తీసుకున్న తొలి వ్యక్తిగా పేరొందాడు.

* 19వ శతాబ్దంలో కెమెరాలు అందుబాటులోకి వచ్చాక చాలా మంది మృతదేహాలతో కలిసి ఫొటోలు తీసుకునేవారట. చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా ఆ ఫొటో దాచుకోవాలనే భావనతో మృతదేహంతో ఫొటోలు దిగేవారట. సంపన్నులు తాము చనిపోయాక వారసులు దాచుకోవడం కోసం బతికున్నప్పుడే మంచి స్టిల్స్‌తో ఫొటోలు దిగడం మొదలుపెట్టారట.

* కెమెరా అనగానే గుర్తుకొచ్చే బ్రాండ్‌ ‘కొడక్‌’. ఈ సంస్థను 1888లో స్థాపించారు. అయితే కొడక్‌ అనే పేరుకు అసలు అర్థమే లేదు. కేవలం ‘కె’ అక్షరం పలకడానికి బాగుంటుందని అలా పెట్టారట. 

* మొదట్లో అన్ని బాక్ల్‌ అండ్‌ వైట్‌ ఫొటోలే. 1861లో బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త జేమ్స్‌ మాక్స్‌వెల్‌ తొలిసారి కలర్‌ ఫొటో తీశారు. 

* ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలను సేకరించిన వ్యక్తిగా ముంబయికి చెందిన దిలీశ్ పరేఖ్‌ నిలిచారు. ఆయన వద్ద 4,500 రకాల కెమెరాలు ఉన్నాయి.

* చంద్రుడిపై దాదాపు 12 హెస్సెల్‌బ్లాడ్‌ కెమెరాలు పడి ఉన్నాయట. వ్యోయగాములు తమవెంట కెమెరాలు తీసుకెళ్లి.. అక్కడ ఫొటోలు దిగేవారట. అయితే తిరిగి వచ్చే సమయంలో పరిశోధన కోసం రాళ్లు, మట్టి తీసుకొచ్చేవారట. అయితే బరువు ఎక్కువ కాకూడదని కెమెరాల్లోని రీళ్లను తీసుకొని కెమెరాను చంద్రుడిపైనే వదిలేసి వచ్చారట.

* ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు చూసిన ఫొటోగ్రాఫ్‌ ఏదైనా ఉందంటే అది మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ డిఫాల్ట్‌ స్క్రీన్‌‌. దానిని అమెరికన్‌ ఫొటోగ్రాఫర్‌ ఛార్లెస్‌ ఒరేర్‌ తీశారు. 1996లో కాలిఫొర్నియాలోని నపా అండ్‌ సొనొమా కౌంటీస్‌లో ప్రయాణిస్తూ ఓ చోట ఈ ఫొటోను తీశారు. 1998లో మైక్రోసాఫ్ట్‌ ఈ ఫొటోను తీసుకుంది. 2001లో మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌పీకి తొలిసారి ఈ ఫొటోను ఉపయోగించింది. 

* ఇప్పుడు కెమెరాలకు ఫ్లాష్ లైట్స్‌ ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఫ్లాష్‌ లైట్‌ కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించారు. పొటాషియం క్లోరైడ్‌, అల్యూమినియం కలపి బాంబుగా తయారు చేసేవారు. దాని పేల్చినప్పుడు వచ్చే వెలుతురులో ఫొటో తీసేవారు.

* చాలా మంది అనేక రకాల పోజుల్లో ఫొటోలు దిగుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో బాగుంటారు. కానీ ఎక్కువమంది ఎడమవైపు ముఖం చూపిస్తూ దిగే ఫొటోల్లోనే అందంగా కనిపిస్తారట.

* వృతిపరంగా కెమెరాలు ఉపయోగించేవారు కాకుండా వ్యక్తిగతంగా కొనుగోలు చేయగల కన్జూమర్‌ డిజిటల్‌ కెమెరాను 1994లో యాపిల్‌ సంస్థ ప్రవేశపెట్టింది. కానీ దాన్ని డిజైన్‌ చేసింది మాత్రం కొడక్‌ సంస్థే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని