Bank Exams: ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు కమిటీ

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Published : 13 Jul 2021 21:17 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బ్యాంకుల్లో క్లరికల్‌ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన  నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నియమించిన కమిటీ తన నివేదికను 15 రోజుల్లోగా సమర్పిస్తుందని వెల్లడించింది. అప్పటి వరకు ఐబీపీఎస్‌ నిర్వహించే పరీక్షలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.

భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించినప్పటికీ..  బ్యాంకుల్లో క్లరికల్‌ స్థాయి ఉద్యోగ నియామక పరీక్షలను ఐబీపీఎస్‌ కేవలం ఆంగ్లం, హిందీ భాష్లలోనే ఎందుకు నిర్వహిస్తోందంటూ పలు వార్తా సంస్థలు ప్రశ్నించాయి. ఆ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం 2019లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశాయి. అయితే ఆ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో(ఆర్‌ఆర్‌బీ) నియామకాలకు సంబంధించి మాత్రమే ఆమె హామీ ఇచ్చినట్లు తెలిపింది.

బ్యాంకు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గ్రామీణ యువతకు చేయూతనిచ్చేందుకు ఆర్‌ఆర్‌బీల్లో  ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ స్కేల్‌ 1 నియామక పరీక్షలను కొంకణి, కన్నడ సహా 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించేందుకు 2019లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది.  అప్పటినుంచి ఆర్‌ఆర్‌బీల్లో నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించినట్లు గుర్తు చేసింది. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని