Updated : 02 Nov 2020 11:32 IST

అమెరికా తొలి అధ్యక్ష ఎన్నికలు ఎలా జరిగాయంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అమెరికా ప్రజలు.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కిస్తారా? ఆయన్ను కాదని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు పట్టం కడతారా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండటం సహజమే. ఫలితం తేలే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత ఎన్నికలు ఏమో గానీ, అసలు అమెరికా తొలి ఎన్నికలు ఎలా జరిగాయి? జార్జ్‌ వాషింగ్టన్‌ అధ్యక్షుడిగా మారిన విధానం ఓ సారి చూస్తే..

1776లో అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత 1789 వరకు బ్రిటీష్‌ అధీనంలో ఉన్న 13 ప్రాంతాలు అమెరికాలో భాగమవుతూ వచ్చాయి. అయితే, 1788 అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఒక అధ్యక్షుడిని ఎంచుకోవాలని అప్పటి నేతలు నిర్ణయించారు. అప్పుడు ఎలాంటి రాజకీయ పార్టీలూ లేవు. అమెరికా రాజ్యాంగం ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్యాంగానికి మద్దతిచ్చే, వ్యతిరేకించే నాయకులు మాత్రమే ఉండేవాళ్లు. అయినా అందరూ కలిసి అమెరికా అధ్యక్షుడిని ఎంచుకోవాలి. అధ్యక్ష పదవికి ఎవరు అర్హులని ఆలోచిస్తుండగా.. అందరికీ జార్జ్‌ వాషింగ్టన్‌ కనిపించారు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్య పోరులో తీవ్రంగా పోరాడిన వ్యక్తి. సైన్యంలోనూ కీలక బాధ్యతలు వహించారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం ఏర్పాటుకు కృషి చేశారు. దేశానికి ఒక దిశానిర్దేశం చేసే వ్యక్తిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా మంచి పేరుంది. దీంతో ఆయనను మించిన వ్యక్తి ఎవరూ లేరని నేతలు నమ్మారు. వాషింగ్టన్‌కు అధ్యక్ష పీఠంపై కూర్చొవాలన్న ఆశ లేకున్నా.. నేతల కాంక్ష మేరకు ఒప్పుకున్నారు. అలా ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి వాషింగ్టన్‌ ఎంపికయ్యారు. ఇక అసలు సమస్య ఉపాధ్యక్షుడిగా ఎవర్ని ఎంచుకోవాలనే విషయంమీదే. రాజ్యాంగం ప్రకారం ఎలక్టోరల్‌ కాలేజ్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమెరికాలోని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించే ఎలక్టర్స్‌కు రెండేసి ఓట్లు వేసే హక్కు ఉంటుంది. అత్యధిక ఓట్లు ఎవరికి వస్తాయో వారు అధ్యక్షుడిగా.. రెండో స్థానంలో ఉన్నవారు ఉపాధ్యక్షుడవుతారు. అలా 1788 డిసెంబర్‌ 15న ప్రారంభమైన ఎన్నికలు 1789 జనవరి 10 వరకు జరిగాయి.

ఇద్దరికి సమాన ఓట్లు పడొద్దని..

అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని ఎంపిక చేసుకొని పోటీదారులు లేకుండా పోలింగ్‌ నిర్వహిస్తే ఇద్దరికీ సమాన ఓట్లు పడతాయి. అందుకే జార్జి వాషింగ్టన్‌కు పోటీగా మరో పదకొండు మందిని పోటీకి దింపారు. అయితే, ఎలక్టర్లు రెండు ఓట్లలో ఒక ఓటును వాషింగ్టన్‌కు.. మరో ఓటును పదకొండు మందిలో వారిని నచ్చిన అభ్యర్థికి వేశారు. దీంతో వాషింగ్టన్‌కు పూర్తిగా 69 ఓట్లు పడగా.. మరో 69 ఓట్లు చీలిపోయి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన అభ్యర్థులకు పడ్డాయి. వారిలో అత్యధికంగా 34 ఓట్లు సాధించిన జాన్‌ ఆడమ్స్‌ ఉపాధ్యక్షుడయ్యారు. చాలా మంది నాయకులు ఆడమ్స్‌ ఉపాధ్యక్షుడు కావాలనే కోరుకున్నారు. ఎందుకంటే అధ్యక్షుడైన వాషింగ్టన్‌ దక్షిణాది రాష్ట్రమైన వర్జీనియాకు చెందిన వ్యక్తి కాగా.. ఆడమ్స్‌ ఉత్తరాది రాష్ట్రమైన మసాచూసెట్స్‌కు చెందిన వ్యక్తి. దీంతో యూఎస్‌ ప్రభుత్వం రెండు ప్రాంతాలకు న్యాయం చేసినట్లు అవుతుందని భావించారు. అనుకున్నట్లుగానే వారిద్దరూ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1789 ఏప్రిల్‌ 30న న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో ఉన్న ఫెడరల్‌ హాల్‌లో అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్‌ వాషింగ్టన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రెండుసార్లు అధ్యక్షుడిగా అమెరికా ప్రజలకు సేవలందించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి.. వచ్చాక దేశాభివృద్ధి కోసం పాటుపడిన వాషింగ్టన్‌ను అమెరికా జాతి పితగాను అభివర్ణిస్తుంటారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని