Tourism: రొటీన్‌ ట్రిప్పులతో బోర్‌ కొట్టేసిందా! ఇవి ట్రై చేయండి..

రొటీన్‌ ట్రిప్‌లతో బోర్‌ కొట్టెసిందా..! అయితే, మీరెప్పుడూ చూడని పలు పర్యాటక హరివిల్లులు మిమ్మల్ని రా..రమ్మంటున్నాయి. వాటిలోని కొన్నింటి జాబితా మీ కోసం..

Updated : 17 Nov 2021 12:45 IST

కాంక్రీట్ అభయారణ్యంలో.. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో.. కాసేపు ప్రకృతి ఒడిలో సేదతీరితే కలిగే కిక్కే వేరు. అలాంటి మనకు తెలియని కొత్త పర్యాటక ప్రదేశాలకు వెళితే..! ప్రకృతి రమణీయతల మేళవింపుగా ఉండే ఆ ప్రదేశాల్లోని అనుభూతిని మాటల్లో చెప్పలేం. అయితే, రొటీన్‌ ట్రిప్‌లతో బోర్‌ కొట్టేసిందా..! మీరెప్పుడూ చూడని పలు పర్యాటక హరివిల్లులు మిమ్మల్ని రా..రమ్మంటున్నాయి. కొవిడ్‌ దృష్ట్యా పర్యాటకానికి ప్రభుత్వం సడలింపులిచ్చిన నేపథ్యంలో వాటిలోని కొన్నింటి జాబితా మీ కోసం..

లైట్‌మావ్‌షియాంగ్‌, మేఘాలయా

ఈశాన్య భారతావనిలోని ఓ సుందర పర్యాటక ప్రాంతం లైట్‌మావ్‌షియాంగ్‌. మేఘాలయాలోని ఈస్ట్‌కాశీ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. కాటన్‌-క్లౌడ్‌ నగరంగా పిలిచే ఇక్కడ యాత్రికులకు కావాల్సిన అడ్వైంచర్‌ దాగి ఉంది. కేవింగ్‌తో పాటు వైల్డర్‌నెస్‌ హైకింగ్‌కు ఈ చోటు ఎంతో ప్రసిద్ధి. అందమైన అద్దాల వంటి సరస్సులనూ మీరు ఇక్కడ చూడొచ్చు.  


ఇడుక్కి, కేరళ

దైవభూమిగా పేరుగాంచిన కేరళలో పర్యాటకానికి కొదవ లేదు. కొచ్చి, అలెప్పి వంటి గొప్ప పర్యాటక ప్రాంతాలకు అతిసమీపంలో ఇడుక్కి ప్రాంతం ఉంది. కులమావు డ్యామ్‌, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌ వంటివి ఇక్కడి అద్భుత ప్రదేశాలు. ఇడుక్కికి సమీపంలోనే ఎరావికుళం నేషనల్‌ పార్కు కూడా ఉంది.


చౌప్తా, ఉత్తరాఖండ్

హిల్‌ స్టేషన్లకు పర్‌ఫెక్ట్‌ గేట్‌వే ఉత్తరాఖండ్‌లోని చౌప్తా. మిని స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన ‘చౌప్తా’ మంచుతో కప్పబడి ఉంటుంది. కొత్తదనం కొరుకునేవారికి ఇదో మంచి డెస్టిని. హిల్‌ స్టేషన్ల ప్రాంతం కావడంతో ఇక్కడి అడ్వైంచరీ ట్రెక్కింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


హలేబిడు, కర్ణాటక

దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో కర్ణాటకలోని హలేబిడు ఒకటి. వందల ఏళ్ల నాటి చరిత్ర ఈ నగరం సొంతం. ఒకప్పుడు హోయసల రాజధానిగా (ద్వారసముద్రం) గా 200 ఏళ్లు వర్దిల్లింది. ఇక్కడి హోయసలేశ్వర ఆలయం అత్యంత పురాతనమైనది. పాత నగరాల చరిత్రను, సంస్కృతిని అన్వేషించాలనుకునే వారు హలేబిడుని చూపి ఔరా అనాల్సిందే. అంతేకాక ఇక్కడి యాగచి డ్యామ్‌, పురావస్తు మ్యూజియం సందర్శకులను కట్టిపడేస్తాయ్‌. 


పటాన్‌, గుజరాత్‌

చాంద్వ పాలకుల అ‘పూర్వ’ రాజధాని ప్రస్తుత గుజరాత్‌లోని పటాన్‌. ఈ అందమైన పట్టణం క్రీ.శ 745 నాటిది. తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరింది. ఇక్కడి గొప్ప వారసత్వ చిహ్నాలు, పురాతన దేవాలయాలు, సరస్సులు ఎంతో కనువిందు చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అవకాశం ఉంటే ఈ ప్రాంతాలను ఓసారి చుట్టిరండి. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని