Floccinaucinihilipilification: కేటీఆర్‌కు శశిథరూర్‌ షాక్‌..!

కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన శశిథరూర్‌, 29 అక్షరాలతో కూడిన మరో కఠిన ఆంగ్ల పదాన్ని ప్రయోగిస్తూ రీ-ట్వీట్‌ చేయడం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది.

Published : 21 May 2021 19:39 IST

కేటీఆర్‌, శశిథరూర్‌ మధ్య హాస్యాస్పద ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంగ్లభాషలో ఉచ్ఛరించడానికే కాస్తంత కఠినంగా ఉండే కొన్ని పదాలను చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఔషధాల పేర్లు వైద్యులకు తప్ప తేలికగా పలకడం సాధారణ ప్రజలకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఔషధాల పేర్లను గుర్తుచేస్తూ.. మంత్రి కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఇలా పలకడానికే కష్టంగా ఉన్న పేర్లను ఔషధాలకు ఎందుకు పెట్టారో మీకేమైనా తెలుసా? అంటూ సరదా ట్వీట్‌ చేశారు. అంతేకాదు వీటిలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నా అని ఛలోక్తి విసిరారు. తాజాగా కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన శశిథరూర్‌, 29 అక్షరాలతో కూడిన మరో కఠిన ఆంగ్ల పదాన్ని ప్రయోగిస్తూ రీ-ట్వీట్‌ చేయడం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది.

పొసాకోనాజోల్‌, క్రెసెంబా, టోసిల్‌జుమాబ్‌, రెమ్‌డెసివిర్‌, లైపోసోమాల్‌, ఆంఫోటెరెసిన్‌, ఫ్లావీపిరవిర్‌, మోల్నూపిరవిర్‌, బరిసిటినిబ్‌.. ఇలా పలకడానికే కష్టంగా ఉండే పేర్లను ఔషధాలకు ఎందుకు పెట్టారో..?సరదాగా అడుగుతున్నా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఇందులో శశిథరూర్‌ పాత్ర తప్పకుండా ఉండి ఉంటుందంటూ ఛలోక్తి విసిరారు. దీనికి స్పందించిన శశిథరూర్‌.. ‘అందులో తప్పులేదు. అలాంటి అవసరంలేని వాటిలో మీరెందుకు తలమునకలవుతారు. నాకు వదిలేయండి. కరొనిల్‌, కరొజీరో, గోకరోనాగో అంటూ సంతోషంగా పిలుచుకుంటాను’ అంటూ Floccinaucinihilipilification (29 అక్షరాలతో కూడిన) మరో కఠిన పదాన్ని ప్రయోగించారు. దీంతో నెటిజన్లు వారిద్దరి ట్వీట్‌లపై భిన్నంగా స్పందిస్తూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

ఇక ఆంగ్లభాషలో అతిపెద్ద పదాల్లో Floccinaucinihilipilification ఒకటి. దీనికి అవసరం లేని పని లేదా అలవాటు అని అర్థం. ఇలాంటి కఠిన పదాలను శశిథరూర్‌ పలు సందర్భాల్లో ప్రయోగిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించడంతో మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని