
Pulichintala Project: పులిచింతలకు భారీగా చేరుతున్న వరదనీరు
గుంటూరు: పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 62వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తి 52,393 క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతున్నారు. మరోవైపు విద్యుదుత్పత్తి కోసం 10వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల జలాశయం పూర్తిసామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా నదిలోకి నీరు విడుదల చేస్తున్నందున పరీవాహక ప్రాంత గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మున్నేరు వాగులోనూ వరద ఉద్ధృతి
మరోవైపు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని మున్నేరు వాగులోనూ వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెన నీటమునిగింది. పెనుగంచిప్రోలు వద్ద వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటి మట్టం నమోదైంది.