Net Zero: నెట్‌ జీరో లక్ష్యం..  భారత్‌ ఇవి చేయాల్సిందే!

‘2070 నాటికి భారత్‌ను సున్నా ఉద్గారాల(నెట్‌ జీరో) స్థాయికి చేర్చుతాం. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, పునరుత్పాదక ఇంధన వాడకం పెంచుతాం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ‘కాప్‌26’ సదస్సులో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మన...

Updated : 03 Nov 2021 14:54 IST

దిల్లీకి చెందిన ఓ సంస్థ అధ్యయనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘2070 నాటికి భారత్‌ను సున్నా ఉద్గారాల(నెట్‌ జీరో) స్థాయికి చేర్చుతాం. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, పునరుత్పాదక ఇంధన వాడకం పెంచుతాం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ‘కాప్‌26’ సదస్సులో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మన దేశ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,600 గిగావాట్స్‌కు పైగా పెరగాల్సి ఉంటుంది. విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో బొగ్గు వినియోగం 2060 నాటికి 99 శాతం తగ్గించాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ మేరకు సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవసరం అని దిల్లీకి చెందిన ప్రముఖ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) అంచనా వేసింది. ముడి చమురు వినియోగం 2050 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, కానీ.. ఆ తర్వాతి రెండు దశాబ్దాల్లో 90 శాతం తగ్గాల్సి ఉంటుందని పేర్కొంది. నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించే క్రమంలో 2030- 2100 మధ్య భారత్‌కు 13 వేల బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వ్యయం అవుతుందని అంచనా వేసింది.

సీఈఈడబ్ల్యూ పేర్కొన్న ఆయా అంశాలు..

* బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా ఆధారపడిన భారత్‌లో తొలుత బొగ్గు వినియోగం తగ్గాలి. ఈ తరహా విద్యుత్ ఉత్పత్తి 2040 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుని, 2040- 2060 మధ్య 99 శాతం తగ్గాలి.

* సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2070 నాటికి 5,630 గిగావాట్లకు పెరగాలి. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1792 గిగావాట్లకు చేరుకోవాలి. ఈ ఏడాది జులై నాటికి.. భారత్‌ పునరుత్పాదక శక్తి సామర్థ్యం 96.96 గిగావాట్లుగా ఉంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఇది 25.2 శాతం. మరోవైపు దీన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

* 2070 నాటికి కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 84 శాతానికి చేరుకోవాలి. సరకు రవాణా ట్రక్కుల్లో విద్యుత్ ట్రక్కుల వాటా 79 శాతం ఉండాలి. మిగిలినవి హైడ్రోజన్‌ ఇంధనంపై ఆధారపడి పనిచేయాలి. విమానాలు, వాహనాల ఇంధనాల్లో జీవ ఇంధనం మిశ్రమ వాటా 2070 నాటికి తప్పనిసరిగా 84 శాతానికి చేరుకోవాలి.

* పారిశ్రామిక రంగంలో బొగ్గు వినియోగం 2040 నాటికి గరిష్ఠ  స్థాయికి చేరుకుంటుంది. కానీ.. 2040- 2065 మధ్యకాలంలో 97 శాతానికి తగ్గాలి. మొత్తం పారిశ్రామిక శక్తి వినియోగంలో హైడ్రోజన్ వాటా 2050 నాటికి 15 శాతానికి, 2070 నాటికి 19 శాతానికి పెరగాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని