Prakasam: ఆ మాజీ మంత్రి మహా కంత్రీ.. ఇదీ చొక్కా విప్పిన ఓ పెత్తందారీ నిర్వాకం

పేరుకు బడుగు.. ఏనాడూ వారికి చేసిందేమీ లేదు. డాబూ దర్పం అంతా వేరే లెవెలు. రాజకీయాల్లో తనకు అవసరమైనప్పుడే సామాజిక వర్గ కార్డు బయటికి తీస్తారు.

Updated : 21 Jun 2024 09:34 IST

పేదల పొట్టకొట్టేలా మాయాజాలం
రైతుల పేరుతో ఏకంగా వంతెన నిర్మాణం
ఉల్లాసానికంటూ ప్రజాధనంతో ఉద్యానవనం
ఆనక స్థిరాస్తి వ్యాపారానికి సంతర్పణం

పేరుకు బడుగు.. ఏనాడూ వారికి చేసిందేమీ లేదు. డాబూ దర్పం అంతా వేరే లెవెలు. రాజకీయాల్లో తనకు అవసరమైనప్పుడే సామాజిక వర్గ కార్డు బయటికి తీస్తారు. గత ప్రభుత్వంలో అయిదేళ్లపాటూ అమాత్య గిరి వెలగబెట్టారు. కీలకమైన శాఖలను గుప్పిట పట్టి సంపాదనా వనరుగా మార్చుకున్నారు. పదవులను అడ్డుపెట్టుకుని ‘ఆది’ నుంచీ సంపాదనే ‘మూలం’గా పనిచేశారు. నియోజకవర్గంలోనూ పేదల పొట్టగొట్టి అడ్డగోలుగా ప్రజాధనాన్ని బొక్కడంలో మాయాజాలం చూపారు. సొంత సామాజిక వర్గాన్ని నిత్యం ఆమడ దూరం పెట్టారు. ఎన్నికల్లో లబ్ధికి మాత్రం కంత్రీ వేషాలు వేశారు. అనని మాటలకు క్షమాపణలు చెప్పాలంటూ చొక్కా విప్పి నిసిగ్గుగా వ్యవహరించారు. పర్యటనకొచ్చిన నాటి ప్రధాన ప్రతిపక్ష నేత ఎదుట నిరసన తెలిపి అభాసుపాలయ్యారు.

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం 

నాలుగు ప్లాట్ల కోసం వాగుకే ఎసరు...

తమ స్వార్థం కోసం ఊరినే అమ్మేస్తారు కొందరు. ఈ కోవలోకే వస్తారు యర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఓ మాజీ కంత్రీ. స్థిరాస్తి వ్యాపారుల నుంచి అప్పనంగా అందే నాలుగు ప్లాట్లకు కక్కుర్తి పడ్డారు. రెండున్నర ఎకరాల వాగు పోరం బోకు భూమిని అడ్డంగా కట్టబెట్టారు. క్రయవిక్రయాలకు తనవంతు సాయం కూడా అందించారు. స్థిరాస్తి వ్యాపారం సాగేందుకు ఏకంగా ప్రజాధనంతో ఏకంగా ప్రభుత్వ పార్కును నిర్మించేలా మంజూరు చేయించి.. నిర్మించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల రుణం తీర్చుకున్నారు. ఇక్కడా ఎకరా ముప్ఫై సెంట్లలో ప్రభుత్వ పార్కు నిర్మించి మిగతా పోరంబోకు భూమి కబ్జా చేశారు. 

ఖాళీ చేయించి.. కట్టబెట్టి...

యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు రోడ్డు పక్కన పట్టణానికి చెందిన ఇద్దరికి మిల్లంపల్లి సర్వే నంబర్‌ 129లో పన్నెండు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల రిజిస్టర్‌ భూమి ఉంది. దీంతోపాటు పక్కనే ఉన్న కొంత రాళ్లవాగు పోరంబోకు సర్వే నంబర్‌ 28/1లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ వాగు పోరంబోకు భూమిని చాలా కాలం నుంచి కొంత మంది పేద రైతులు పంటలు సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం రెండున్న ఎకరాల రాళ్లవాగు పోరంబోకు భూమిలోని పేదలను సదరు మాజీ ఖాళీ చేయించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టారు. ఆ స్థలంలో ఇది ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి అని రెవెన్యూ అధికారులతో బోర్డు పెట్టించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ బోర్డును తీసేయించారు.

పొలాలకు దారి లేకుండా కంచె...

వై.పాలెం పట్టణం నుంచి స్థిరాస్తి వెంచర్‌ వేసిన ప్రదేశానికి రాళ్లవాగు అడ్డుగా ఉంటుంది. దీంతో రాకపోకలకు ఇక్కట్లు ఎదురవుతుంటాయి. ఇక్కడే అక్రమార్కుల బుద్ధి పాదరసంలా పనిచేసింది. రైతులు తమ పొలాలకు రాళ్లవాగులో నుంచి వెళ్లేందుకు ఇబ్బంది  పడుతున్నారంటూ వంతెన నిర్మాణానికి అధికారుల నుంచి అనుమతులు తెచ్చారు. ఆ తర్వాత ప్రైవేట్‌ వ్యక్తులతో రూ. కోటి వ్యయంతో వంతెన పూర్తిచేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయట పడింది. ఆ వంతెన మీదుగా రైతులు నడిచేందుకు వీల్లేకుండా చేశారు. ప్లాట్ల స్థలంతో పాటు వాగు పోరంబోకు భూమిని కలిపి చుట్టూ కంచె వేసి రైతులు పొలాలకు వెళ్లకుండా చేశారు. ఈ విషయమై ప్రశ్నించిన వారిని అప్పటి పోలీసుల అండతో భయభ్రాంతులకు గురిచేశారు.

హవ్వ.. వాగులో ఉద్యాన వనమట...

 స్థిరాస్తి వ్యాపారం సాఫీగా సాగాలంటే పరిసరాలు అందంగా ఉండాలని తలిచారు. అనకున్నదే తడవుగా ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌  కింద రూ.1.18 కోట్లతో ఇక్కడ పార్కు మంజూరైంది. రాళ్లవాగు ఒడ్డునున్న ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిలోని ఎకరా ముప్ఫై సెంట్ల స్థలంలో ఉద్యాన వనాన్ని నిర్మించారు. అందులో జారుడు బండలు, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయించారు. విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోలేదు. అడపాదడపా కురుసే వర్షాలకు ఇప్పటికే పార్కు గోడలు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాళ్ల వాగు పూర్తిగా ప్రవహిస్తే ఒడ్డున నిర్మించే పార్కు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. పంచాయతీ, సాగు నీటి పారుదల అధికారుల అనుమతి లేకుండానే ఈ పార్కు నిర్మించడం గమనార్హం. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యానవనం, వంతెన నిర్మాణం, వాగు ఆక్రమణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల లబ్ధి కోసం నిర్మించిన ఉద్యాన వనం ఇదే...

పొలాలకు వెళ్లకుండా స్థిరాస్తి వ్యాపారులు నిర్మించిన కంచె  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని