ఫ్రెంచ్‌ నేర్చుకోవాలా? ఫ్రెంచ్‌ వృద్ధులతో ముచ్చటించండి..!

కొత్త భాష నేర్చుకోవడం మంచి విషయం. కొంతమంది సరదాకి నేర్చుకుంటారు.. మరికొంత మంది అవసరానికి నేర్చుకుంటారు. విదేశాల్లో స్థిరపడాలని, ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లు ఆయా దేశ భాషలు నేర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే పలు పాఠశాలలు విద్యార్థులకు చిన్నతనం

Published : 14 Jan 2021 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త భాష నేర్చుకోవడం మంచి విషయం. కొంతమంది సరదాకి నేర్చుకుంటారు.. మరికొంత మంది అవసరానికి నేర్చుకుంటారు. విదేశాల్లో స్థిరపడాలని, ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లు ఆయా దేశ భాషలు నేర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే పలు పాఠశాలలు విద్యార్థులకు చిన్నతనం నుంచే జర్మన్‌, ఫ్రెంచ్‌, చైనీస్‌ తదితర విదేశీ భాషలు నేర్పిస్తున్నాయి. ఎంత నేర్చుకున్నా.. మాట్లాడటం ప్రారంభిస్తే కానీ, భాషపై పట్టు రాదు. అందుకే, ఫ్రాన్స్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. దీంతో ఫ్రెంచ్‌ నేర్చుకునేవారికి భాషపై పట్టు.. వృద్ధులకు తోడు లభిస్తుందని చెబుతోంది.

ఓల్డీస్సీ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమం కోసం పనిచేస్తుంటుంది. వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధులు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఫ్రాన్స్‌లోనూ అనేక మంది వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైన వారితో మాట్లాడితే ఒంటరితనం పోయి సంతోషంగా ఉంటారని సంస్థ నమ్మకం. అందుకే ఫ్రాన్స్‌లో ‘షేర్‌ అమి’ పేరుతో ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రపంచంలో ఎవరైనా సరే ఫ్రెంచ్‌ భాష నేర్చుకుంటున్న వారు.. నేర్చుకోవాలనుకునే వారు ఫ్రాన్స్‌లో ఉన్న ఒంటరి వృద్ధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. ఇలా మాట్లాడం ద్వారా భాషను త్వరగా నేర్చుకోవచ్చు. అలాగే వృద్ధులకు కొంత సాంత్వన లభిస్తుంది. వృద్ధులతో మాట్లాడే ఆసక్తి ఉన్న వారు ఓల్డీస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తే సంస్థ నిర్వాహకులు వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేస్తారు. భలే ఉంది కదా ఆలోచన...!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని