దోస్తును కాపాడమంటూ విరాళాల సేకరణ

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న స్నేహితుడు, వైద్యం చేయించలేని నిరుపేద కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో మిత్రుడి ప్రాణాలు రక్షించుకునేందుకు స్నేహితులు నడుం బిగించారు.

Updated : 25 Jul 2020 19:51 IST

మహబూబ్‌నగర్‌: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న స్నేహితుడు, వైద్యం చేయించలేని నిరుపేద కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో మిత్రుడి ప్రాణాలు రక్షించుకునేందుకు స్నేహితులు నడుం బిగించారు. జోలె పట్టుకుని రోడ్డెక్కి వీధివీధి తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. 25 తేదీలోపు డబ్బు సిద్ధం చేసుకోవాలని వైద్యులు సూచించడంతో కొన్ని రోజులుగా నగదు సమకూర్చేందుకు తంటాలు పడుతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి స్నేహితుడి ప్రాణాలు నిలబెట్టాలని వేడుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం బండమీద పల్లెకు చెందిన ఆంజనేయులు కారు డ్రైవరు. లాక్‌డౌన్‌ కారణంగా పని దొరక్క ఇంట్లోనే ఉంటున్నారు. రెండు నెలలుగా దగ్గుతుంటే గొంతు నుంచి రక్తం కారుతోంది. ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలన్నీ నిర్వహించి వైద్యానికి రూ.5 లక్షలు ఖర్చవుతుందని, 25 తేదీలోపు సిద్ధం చేసుకోవాలని వైద్యులు సూచించారు.

అసలే పేద కుటుంబం. లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా పనిలేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఇన్నేళ్లు తమతో కలిసి సంతోషంగా తిరిగిన మిత్రుడు అనారోగ్యంతో ఉండటం స్నేహితులను కలచివేసింది. తమ దోస్తు ప్రాణం నిలబెట్టాలనే సంకల్పంతో మహబూబ్‌నగర్‌లో పలు కూడళ్లులో బ్యానర్లు పట్టుకుని తిరుగుతూ ఆర్థిక సహాయాన్ని అర్ధిస్తున్నారు. ఆంజనేయులు స్వగ్రామం పోతంపల్లిలోని అతని స్నేహితులంతా తమకు చేతనైనంతా ఆర్థిక సహాయం చేయగలిగారు. కులసంఘం సైతం తనవంతు సహకారాన్ని అందించింది. ఆ డబ్బుతోనే ప్రస్తుతం చికిత్స అందుతోంది. పూర్తిస్థాయి చికిత్స చేయించి మిత్రుడి ప్రాణాలు నిలపాలని స్నేహితులు దాతలను వేడుకుంటున్నారు. కొన్ని రోజులుగా విరాళాలు సేకరిస్తున్నా చికిత్సకు సరిపడా డబ్బు జమ కావడంలేదు. ఎంత ప్రయత్నించినా గడువులోగా రూ.5 లక్షలు జమ చేయడం కష్టసాధ్యంగా తోస్తోంది. దాతలు ఎవరైనా స్పందించి ఆపన్నహస్తం అందించాలని స్నేహితులు వేడుకుంటున్నారు. సకాలంలో తమ స్నేహితుడికి వైద్యం అందేలా దాతలు ముందుకు రావాలని వారు కోరుతున్నారు. దాతలు 9010316481 నెంబరుకు ఫోన్‌పే ద్వారా తమ విరాళాలను పంపాల్సిందిగా వారు విన్నవించుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని