Indian Marriage: 40లక్షల పెళ్లిళ్లు.. రూ.5లక్షల కోట్ల లావాదేవీలు..!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడం, ఆంక్షలు సడలించడంతో వివాహ శుభకార్యాలు ఘనంగా జరిపించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 31 Mar 2022 05:06 IST

కొవిడ్‌ ఆంక్షలు సడలింపుతో మార్కెట్‌లో నూతనోత్సాహం

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడం, ఆంక్షలు సడలించడంతో వివాహ శుభకార్యాలు ఘనంగా జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఏప్రిల్‌ నుంచి జులై వరకు కొనసాగే పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 40లక్షల వివాహాలు జరుగనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వేడుకల నిర్వహణలో భాగంగా దాదాపు రూ.5లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగనున్నట్లు వ్యాపార సంఘాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెండేళ్లుగా మూగబోయిన పెళ్లిళ్ల సీజన్‌.. ఈసారి బ్యాండ్‌ బాజాలతో మరోసారి కొత్తకళను సంతరించుకోనుంది.

దేశంలో గత రెండేళ్లుగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా వివాహ వేడుకల చప్పుడే లేకుండా పోయింది. కొవిడ్‌ ఆంక్షలు మధ్య పరిమిత సంఖ్యలో సన్నిహితుల మధ్య కొందరు వివాహాలు జరిపించగా.. మరికొందరు ఏకంగా కల్యాణాలను వాయిదా వేసుకున్నారు. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ ఉద్ధృతి లేకపోవడంతో ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌ మాత్రం మునుపటి శోభను తేనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 40లక్షల వివాహాలు జరుగుతాయని.. ఆ సమయంలో దాదాపు రూ.5లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) పేర్కొంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో కేవలం దేశ రాజధాని దిల్లీలోనే మూడు లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా వేసింది. దీంతో దిల్లీలోనే దాదాపు రూ.లక్ష కోట్ల లావాదేవీలు జరుగనుందని పేర్కొంది.

ఈ సీజన్‌లో రూ.2లక్షల ఖర్చుతో జరిగే పెళ్లిళ్లు దాదాపు 5లక్షల వరకు ఉంటాయని అంచనా. మరో 10లక్షల పెళ్లిళ్లు రూ.5లక్షల వ్యవయంతో జరిగేవి కాగా మరో పది లక్షల కల్యాణాలు రూ.10లక్షల ఖర్చుతో జరగవచ్చనే వ్యాపార సంఘాలు అంచనా వేస్తున్నాయి. మరో యాభైవేల వివాహాలు రూ.50లక్షల అంచనాతో జరుగనుండగా, రూ.కోటి ఖర్చు చేసే వివాహాల సంఖ్య కూడా సుమారుగా యాభైవేలుగా ఉండవచ్చని సీఏఐటీ అంచనా వేసింది. ఇలా దేశవ్యాప్తంగా ఈ సీజన్‌లో 40లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉండగా.. తద్వారా వివిధ రంగాల్లో రూ.5లక్షల కోట్ల నగదు లావాదేవీలు జరుగనున్నట్లు తెలిపింది. కల్యాణ మండపాలు మొదలు, అలంకరణ, క్యాటరింగ్‌, ఆభరణాలు, నూతన వస్త్రాలు, ఆహ్వాన పత్రికలు, వాహనాలుతోపాలు భిన్న రంగాల్ల్లో వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని పేర్కొంది. సీఏఐటీ ప్రకారం, వివాహా ఖర్చుల్లో 20శాతం వధూవరుల ఆభరణాలకే అవుతుండగా.. 80శాతం ఇతర ఖర్చులు పెడుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని