Khammam: పాడె మోసిన మంత్రులు.. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి(ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు(45) అంత్యక్రియలు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు.

Published : 23 Nov 2022 13:17 IST

ఈర్లపూడి: విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి(ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు(45) అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోడు సాగుకు అడ్డొస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు, అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఆయుధాలివ్వాలని కోరుతున్నారు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అంత్యక్రియల అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే డిసెంబరు నాటికి పోడు భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అర్హులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత లేదు. అక్రమంగా తెలంగాణకు వలసవచ్చిన గుత్తికోయలు ఇలాంటి దారుణానికి పాల్పడటం సరైంది కాదు. గత కొన్నేళ్లుగా ఆయుధాలు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టపరంగా ప్రస్తుతం ఇది సాధ్యం కాదు. ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేసి అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు కేటాయించాలని ఎంతో మంది ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.   

దాడులు చేస్తే ప్రభుత్వం ఊరుకోదు: మంత్రి పువ్వాడ అజయ్‌

మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ ‘‘ఇలాంటి సంఘటనల ద్వారా సిబ్బంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించడంతో పాటు అడవులను పరిరక్షించే చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా గుత్తికోయలు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడాలని చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’’ అని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావుపై దాడి చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మండలంలోని అటవీ భూముల్లో మొక్కల పర్యవేక్షణకు సెక్షన్‌ అధికారి రామారావుతో కలిసి ద్విచక్రవాహనంపై ఎఫ్‌ఆర్వో వెళ్లారు. అదే సమయంలో ఎర్రబోడు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటినచోట వాచర్‌ భూక్యా రాములు విధులు నిర్వర్తిస్తున్నారు. మొక్కలు నాటిన చోట గొత్తికోయలు పశువులు మేపుతున్నారని.. తనతో వాగ్వాదానికి దిగుతున్నారని రాములు ఎఫ్‌ఆర్వోకు సమాచారమందించారు.

దీంతో ద్విచక్రవాహనంపై ఎర్రబోడుకు చేరుకున్న శ్రీనివాసరావు గొత్తికోయలతో మాట్లాడారు. ఆ సమయంలోనే వెనుక నుంచి ఇద్దరు గొత్తికోయలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. పదునైన కత్తులతో తల, మెడ భాగంలో దాడి చేశారు. కింద పడ్డాక ఆయన గొంతు కోశారు. దీంతో ఎఫ్‌ఆర్వో అపస్మారక స్థితికి చేరుకున్నారు. గుత్తికోయలు బెదిరించటంతో సెక్షన్‌ అధికారి, వాచర్‌ అక్కడి నుంచి పరుగెత్తారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శ్రీనివాసరావును తొలుత చంద్రుగొండ పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గంమధ్యలోనే శ్రీనివాసరావు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని