Telangana News: కొడుకు గంజాయి తీసుకున్నాడని.. స్తంభానికి కట్టేసి, కళ్లలో కారం పోసిన తల్లి

కన్న కొడుకు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు.. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మాట వినలేదు. ఎం చెయ్యాలో పాలుపోని ఆ తల్లికి ఓపిక నశించింది.. కన్న కొడుకు జీవితం నాశనం

Published : 05 Apr 2022 02:14 IST

కోదాడ: కన్న కొడుకు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు.. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మాట వినలేదు. ఏం చెయ్యాలో పాలుపోని ఆ తల్లికి ఓపిక నశించింది.. కన్న కొడుకు జీవితం నాశనం కాకూడదన్న ఆలోచనతో కాస్త కఠినంగా వ్యవహరించింది. కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు పాఠశాలకు వెళ్లకుండా మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. చెడు అలవాట్లు.. చెడు స్నేహితుల కారణంగా గంజాయి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.. వ్యసనానికి గురైన బాలుడు.. అతని తల్లి ఎంత చెప్పినా వినలేదు. కళ్ల ముందే కొడుకు చెడుపోతున్నా తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి.. రోజూ మత్తుతో ఇంటికి వచ్చిన కొడుక్కి మంచి మాటలు చెప్పినా వినకపోవడంతో ఆగ్రహించిన తల్లి.. కొడుకును స్తంభానికి కట్టేసింది. ఎలాగైనా కొడుకును దారికి తేవాలని కన్నీళ్లు దిగమింగుతూ కళ్లలో కారం పోసి దేహశుద్ధి చేసింది. మత్తు పదార్థాలు మానేస్తానని కొడుకు మాట ఇవ్వడంతో ఆ తల్లి శాంతించింది. కొడుకుకు స్నానం చేయించి.. చికిత్స అందించి గుండెలకు హత్తుకుంది. ఈ సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తల్లి చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. కొడుకును మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించిన తల్లి.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చెడు అలవాట్లపై అవగాహన కల్పించాలని ఆ తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

కోదాడలో విచ్చలవిడిగా గంజాయి..

మరోవైపు కోదాడ పట్టణం రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి యువత పెద్ద మొత్తంలో గంజాయి వినియోగిస్తున్నారు. కోదాడ పట్టణంలోనే ఇప్పటివరకు పలు గంజాయి కేసులు నమోదు అయ్యాయి. పలువురికి కౌన్సెలింగ్ ఇవ్వగా, కొంత మంది జైలుకు వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని