
indian oil: ఇండియన్ ఆయిల్ ఇ-వోచర్.. సోషల్‌మీడియాలో ట్రోల్!
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్రం సుంకాలు తగ్గించినా.. లీటర్ పెట్రోల్ ధర రూ.100పైనే ఉంది.. దీంతో పెట్రో ధరల పెంపుపై చాలా మంది వినూత్న నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల వివాహ కార్యక్రమాల్లో వధువరులుకు 5 లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చిన సందర్భాలూ కనిపించాయి. అయితే, ఆ బహుమతి కాన్సెప్ట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీరియస్‌గా తీసుకుంది. అధికారికంగా పెట్రోల్/డీజిల్‌ను ఇతరులకు బహుమతిగా ఇచ్చేలా ఇ-ఫ్యూయల్ వోచర్లను ప్రవేశపెట్టింది. శుభకార్యాల్లో నచ్చిన వ్యక్తులకు వీటిని బహుమతిగా ఇవ్వండంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తోంది. గత దీపావళి, ధన్తేరస్ పర్వదినాల్లోనూ ఈ వోచర్లపై బాగా ప్రచారం చేసింది. వీటిని one4u.easyfuel.in వెబ్సైట్లో పొందొచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. వోచర్ ధర(పెట్రోల్/డీజిల్ విలువ) కనీసం.. రూ.500 కాగా.. గరిష్ఠంగా రూ.10వేలుగా ఉంది. అయితే, ఇండియన్ ఆయిల్ విక్రయిస్తున్న ఇ-ఫ్యూయల్ వోచర్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
మీ స్నేహితుల వివాహానికి ఖరీదైన బహుమతి తీసుకెళ్లాలంటే ఈ ఇ-వోచర్ కొనుగోలు చేయండంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. పెట్రోల్‌కి ఇ-వోచర్ తీసుకొచ్చిన్నట్లే ప్రభుత్వం.. టమోటాలకు కూడా ఇ-వోచర్ తెస్తే బాగుంటుందని వ్యంగ్యంగా స్పందించాడు. మోదీ ప్రభుత్వం పెరిగిన చమురు ధరల్ని తగ్గించడం మానేసి.. ఆకాశనంటిన ధరలతోనూ మార్కెటింగ్ చేసుకుంటోందని మరొకరు విమర్శలు చేశారు.
► Read latest General News and Telugu News