Hyderabad: అందుబాటులోకి కొత్త ఫ్లైఓవర్‌.. ఐటీ కారిడార్‌ నుంచి ఔటర్‌పైకి రయ్‌..రయ్‌

మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు పై వంతెనలు విరివిగా నిర్మిస్తున్నారు.ఈక్రమంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు తెరదించేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Published : 25 Nov 2022 01:37 IST

హైదరాబాద్‌: విశ్వనగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ క్రమబద్ధీకరించేందుకు ఫ్లైఓవర్‌ల నిర్మాణంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌డీపీ)  ప్రోగ్రామ్‌ ద్వారా చేపట్టిన శిల్పా లేఔట్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని శుక్రవారం ఉదయం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నగరంలో అనూహ్యంగా పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఔటర్‌పైకి చేరుకోవడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు రూ.190 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఇది పొడవైన పైవంతెనల్లో ఒకటిగా నిలవనుంది. అద్దాల, భారీ భవంతుల నడుమ ఈ వంతెన కొత్త అందాలను సంతరించుకుంది. శిల్పా లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ వల్ల ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌సిటీ మధ్య రోడ్‌ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్‌ ట్రాఫిక్‌ సమస్యలకు మంచి ఉపశమనం కలుగుతుంది. హెచ్‌కేసీ, మీనాక్షి టవర్‌ ప్రాంతంలో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.   

నగరం రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈక్రమంలో ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ విశేష కృషి చేస్తోంది. ఐటీ పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్‌లో గచ్చిబౌలి, మాదాపూర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాలు  గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రవాణా వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రోగ్రామ్‌ ద్వారా చేపట్టిన కారిడార్లు, అండర్‌ పాస్‌లు, ఆర్‌వోబీలు లాంటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు దోహదపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని