
Ganesh immersion: తొలిసారి పీవీ మార్గ్‌లోనూ గణేశ్ నిమజ్జనాలు: సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం రోజు బందోబస్తు ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌నకు సంబంధించిన బుక్‌లెట్‌ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విడుదల చేశారు. నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘గతేడాది కరోనా వల్ల గణేశ్ ఉత్సవాలు జనసందోహం మధ్య జరగలేదు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ప్రజలు నిమజ్జనంలో పాల్గొననున్నారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశాం. దాదాపు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలు ఈ బందోబస్తులో పాల్గొననున్నాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వజ్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. గణపతి విగ్రహాలకు జియో ట్యాగింగ్, దాదాపు 9వేల విగ్రహాలకు బార్ కోడ్ ఇచ్చాం. నాలుగు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు నగరంలో 40 వేల వరకు ఉండొచ్చు. నిమజ్జనానికి 55 క్రేన్లు ఉపయోగిస్తున్నాం. హైదరాబాద్ కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తారు. బస్టాండ్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, జన సమూహ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాం. మహిళల భద్రత కోసం షీ టీమ్ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 17 కిలోమీటర్ల మేర గణేశ్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేశారు’’ అని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.