
డెలివరీ బాయ్ నుంచి సర్పంచ్ స్థాయికి!
తెదేపా మద్దతుతో గెలిచిన సామాన్యుడు
అనంతపురం: గ్యాస్ డెలివరీ బాయ్‌గా సేవలందించిన ఒకాయనను ప్రజలు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా గెలిపించారు. ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్న ఆ పంచాయతీలో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అలా ఆయన ఓ గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు అయ్యారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఆయనకు ఈ అరుదైన అవకాశం దక్కింది. అనంతపురం జిల్లా రాప్తాడు పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో, ఓ సామాన్యుడికి మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అందువల్ల 15 ఏళ్లుగా వంటగ్యాస్ డెలివరీ బాయ్‌గా సేవలందిస్తున్న తిరుపాల్‌కు ఆ పార్టీ మద్దతు ఇచ్చింది.
గతంలో తిరుపాల్‌కు ఏ రాజకీయ పార్టీతోగానీ, నాయకులతోగానీ సంబంధాలు లేవు. కేవలం గ్యాస్బాయ్గా ప్రజలను నిత్యం కలుస్తూ, సంబంధాలు పెంచుకున్నాడు. మాజీ మంత్రి పరిటాల సునీత మద్ధతుతో ఆయన పోటీలో నిలిచి, విజయం సాధించారు. ప్రజల ఆదరాభిమానాలతోనే తాను సర్పంచిగా గెలిచినట్లు తిరుపాల్ తెలియజేశారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే.. ఉదయాన్నే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమవుతున్నారు. పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు పంచాయతీకి సంబంధించిన పనులు పూర్తి చేసుకొని, తిరిగి తన వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. ఆటోలో గ్యాస్ సిలిండర్లు తీసుకొని డెలివరీ కోసం ప్రతి ఇంటి గడపకీ వెళుతున్నారు.
తన భర్త సర్పంచి కావడంపై తిరుపాల్ భార్య సావిత్రి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ దంపతులు తాము రాప్తాడు ప్రజలకు చాలా రుణపడి ఉన్నామని పేర్కొన్నారు. సర్పంచిగా ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే, తనను ఇంతవాడిని చేసిన గ్యాస్‌బాయ్ వృత్తిని మాత్రం వదలనని తిరుపాల్ గర్వంగా చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.