పోకిరీలు, ఈవ్‌టీజర్ల.. పనిపట్టారు!

విద్యార్థినులు, యువతులు, మహిళలకు అండదండగా ఉంటున్న షీ బృందాలు ఈ ఏడాదిలో ఫలవంతంగా విధులు నిర్వహించాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు, అవగాహన సదస్సుల ద్వారా షీ బృందం

Updated : 02 Jan 2020 07:11 IST

రోజుకు మూడు ఫిర్యాదుల స్వీకరణ
షీ బృందాల భరోసా
ఈనాడు, హైదరాబాద్‌

విద్యార్థినులు, యువతులు, మహిళలకు అండదండగా ఉంటున్న షీ బృందాలు ఈ ఏడాదిలో ఫలవంతంగా విధులు నిర్వహించాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు, అవగాహన సదస్సుల ద్వారా షీ బృందం సభ్యుల పనితీరు తెలుసుకుంటున్న బాధితులు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇంతేకాదు.. బహిరంగ ప్రదేశాలు.. బస్‌స్టాప్‌లు.. పర్యాటక ప్రాంతాలు... ఉద్యానవనాలు... కోచింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాలు.. చివరకు దేవాలయాల వద్ద కూడా ‘షి’ బృందం సభ్యులు మాటేసి పోకిరీలను, ఈవ్‌టీజర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతులు, విద్యార్థినుల సమస్యలను షీ బృందాలు పరిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది వ్యవధిలో 1322 బాధితులకు సాంత్వన కల్పించారు. నిందితులపై 128 ఐపీసీ కేసులు, 128 పెట్టీ కేసులు నమోదు చేశారు. 1328 మంది ఈవ్‌టీజర్లకు ప్రవర్తన మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

 

ప్రభావం... ఫలితాలు...
* షీ బృందాలు కంటికి కనిపిస్తుండడం, నేరస్థులను అరెస్ట్‌చేస్తుండడంతో స్త్రీవ్యతిరేక హింస కేసులు 20శాతం తగ్గాయి. వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నేరస్థులను పట్టుకుని అరెస్ట్‌చేస్తున్నారు.
* గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ వద్ద నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చిన యువతులను అసభ్యంగా వేధిస్తున్న ముగ్గురు యువకులు మహ్మద్‌ జబేర్‌, సిరాజ్‌ అహ్మద్‌, టి.భాస్కర్‌లను ‘షి’ బృందాలు అరెస్ట్‌ చేయగా..  ఒక్కొక్కరికీ 15రోజుల జైలుశిక్ష, రూ.250లు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
* ఇంటిపక్కనే నివసిస్తున్న యువతిని పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకుని అసభ్య సందేశాలు, వీడియోలను పంపుతున్నాడు. ఇతడి బాధ భరించలేక ఆమె షీ బృందాలను ఆశ్రయించగా.. అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.
* ప్రేమించాలంటూ వెంటబడుతూ వేధిస్తున్న ఒక యువకుడి చిత్రహింసలు భరించలేక ఒక యువతి నెల రోజుల క్రితం ఈ-మెయిల్‌ ద్వారా షీ బృందాలకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు యువకుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

ఈ ఏడాది  కార్యాచరణ...
* జనవరి నెలలో తాజ్‌ కృష్ణా హోటల్‌లో ‘పనిచేస్తున్న చోట్ల మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు’ అంశంపై కార్పొరేటు సంస్థల మానవవనరుల ప్రతినిధులతో కార్యశాల నిర్వహణ.
* మార్చినెలలో మహిళా భద్రపై షీ బృందం ఆధ్వర్యంలో విఆర్‌1 పేరుతో అవగాహన పరుగు నిర్వహణ. అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హాజరు.
* జులై నెలలో మహిళా సంబంధ నేరాలు, సైబర్‌ వేధింపులు, కొత్త తరహా నేరాలపై ఐపీఎస్‌ ప్రొబేషనరీలకు మూడు విడతలుగా అవగాహన కార్యక్రమాలు.
* జులై నెలలో అసహాయులైన మహిళలు, యువతులకు యూఎన్‌డీపీ ఆధ్వర్యంలో పునరావాస కార్యక్రమంలో భాగంగా నైపుణ్యశిక్షణ ప్రారంభం.
* సెప్టెంబరు నెలలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రముఖ సైబర్‌ నేరాల నియంత్రణ నిపుణులు రక్షిత్‌ టండన్‌తో అవగాహన సదస్సు.
* నవంబరు నెలలో వయోధికుల సంరక్షణ కోసం నగరంలోని వేర్వేరు విభాగాల అధికారులతో సమావేశం. వృద్ధులు, మహిళల సమస్యల పరిష్కారానికి కార్యచరణ..


వందశాతం రక్షణగా ఉంటాం...!
- షికాగోయల్‌, అదనపు పోలీస్‌ కమిషనర్‌(నేర పరిశోధన)

హైదరాబాద్‌ నగరంలో విద్యార్థినులు, యువతులు, మహిళలందరికీ వందశాతం రక్షణగా ఉంటాం. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌కు వ్యతిరేకంగా మేం ప్రారంభించిన ‘షీ బృందాలు అనుకున్న ప్రభావాన్ని చూపిస్తున్నాయి.షీ బృందాలంటే హైదరాబాదీ యువతులకు, మాకు పట్టుబడిన పోకిరీలకు బాగా తెలుసు. ప్రముఖులు, వైద్యులు, న్యాయవాదులు, ఇతరులతో అవగాహన పరుగులు నిర్వహిస్తున్నాం.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని