వివేకా కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. రేపు హైకోర్టులో వివేకా కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషనపై విచారణ ఉన్న నేపథ్యంలో సిట్‌ తమ

Updated : 02 Jan 2020 16:44 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. రేపు హైకోర్టులో వివేకా కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషనపై విచారణ ఉన్న నేపథ్యంలో సిట్‌ తమ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం నుంచి అధికారులు కడప నగరంలో వివేకా కేసుకు సంబంధించిన పలు వివరాలను సేకరించే పనిలో పడ్డారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రితోపాటు హరిత హోటల్‌లో వివరాలు సేకరించారు. హరిత హోటల్‌లో దాదాపు రెండు గంటలకు పైగానే పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ ఆధ్వర్యంలో సిట్‌ బృందం విచారణ చేసింది. హోటల్‌ మేనేజర్‌ కిశోర్‌ బాబును విచారించి మార్చి 14, 15 తేదీల్లో ఉన్న రికార్డులను పరిశీలించారు.

మార్చి 15న వివేకా హత్య జరిగిన ముందు రోజు సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వర్‌ రెడ్డి తనకు ఆరోగ్యం బాగాలేదని ఉదయం 5.30గంటలకు  కడపలోని సన్‌రైజ్‌ ఆసుపత్రిలో చేరినట్లు సిట్‌ అధికారుల విచారణలో తేలింది. చికిత్స అనంతరం సాయంత్రం 5 గంటలకు బయటకి వచ్చిన పరమేశ్వర్‌ రెడ్డి కడపలోని హరిత హోట్‌కు వచ్చారు. హోటల్‌ 104 గదిలో తెదేపా నేతను కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి మధ్య రెండు గంటలపాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో వారిరువురు ఏమి మాట్లాడుకున్నారనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చర్చ అనంతరం పరమేశ్వర్‌ రెడ్డి మార్చి 15న తిరుపతి వెళ్లి అక్కడ ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వివేకా హత్య జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరమేశ్వర్‌ రెడ్డిపై సిట్‌ అధికారులు పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని