ముఖం చూసి పాస్‌పోర్టు నిరాకరించారు!

హరియాణాలో పాస్‌పోర్టు కోసం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు సోదరీమణులకు వింత అనుభవం ఎదురైంది. వారిద్దరు చూడటానికి నేపాలీలుగా ఉన్నారని అధికారి పాస్‌పోర్టు జారీ చేసేందుకు తిరస్కరించడంతో వారు ఆందోళనకు గురయ్యారు.

Published : 02 Jan 2020 20:06 IST

ఛండీగఢ్‌: హరియాణాలో పాస్‌పోర్టు కోసం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు సోదరీమణులకు వింత అనుభవం ఎదురైంది. వారిద్దరు చూడటానికి నేపాలీలుగా ఉన్నారని అధికారి పాస్‌పోర్టు జారీ చేసేందుకు తిరస్కరించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హీనా (26), సంతోష్‌(29) అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇటీవల పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు వెరిఫికేషన్‌ అనంతరం అంబాలాలోని పాస్‌పోర్టు కేంద్రం అధికారులు వారిని ఛండీగఢ్‌ కార్యాలయానికి వెళ్లమని సూచించారు. దీంతో అక్కడికి వెళ్లిన వారిద్దరినీ ఓ అధికారి చూసి నేపాలీల్లా ఉన్నారంటూ.. భారత పౌరసత్వం పత్రాల కోసం జిల్లా కమిషనర్‌ కార్యాలయాన్ని సందర్శించాలని సూచించారట. కనీసం వారు వెంట తెచ్చిన ఆధార్‌, ఓటరు కార్డు పత్రాలను సైతం చూడలేదట. అంతేకాకుండా వారిద్దరూ చూడటానికి నేపాలీలుగా ఉన్నారని ఆ అధికారి వారి దస్త్రాలపై రాసినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపారు. 

అంబాలా డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌శర్మ దీనిపై స్పందిస్తూ.. పాసుపోర్టు విషయంలో వీరికి జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిందని.. రెండు రోజుల తర్వాత వారిద్దరినీ ఛండీగఢ్‌ ఆర్‌పీవో కార్యాలయానికి వెళ్లమని సూచించాం. కొద్ది రోజుల్లో వారు పాస్‌పోర్టులు పొందుతారని తెలిపారు. అదేవిధంగా ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీనా.. ‘మా తాత నేపాల్‌ నుంచి వచ్చారు. మా నాన్నతో సహా మేము ఇక్కడే జన్మించాం’ అని చెప్పారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని