విమానంలో బొద్దింక ...రూ.50 వేల పరిహారం

విమాన ప్రయాణంలో అసౌకర్యం కలిగినందుకు ప్రయాణీకులకు విమాన ఛార్జీలతో పాటు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఇండిగో ఎయిర్‌లైన్స్ను కోర్టు ఆదేశించింది.

Published : 04 Jan 2020 00:52 IST

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించిన న్యాయస్థానం

పుణె: విమాన ప్రయాణంలో అసౌకర్యం కలిగినందుకు ప్రయాణికులకు విమాన ఛార్జీలతో పాటు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... స్కంద్‌ అసీమ్‌ బాజ్‌పాయ్‌, సురభి రాజీవ్‌ భరద్వాజ్‌ అనే ఇద్దరు ప్రయాణికులు డిసెంబర్‌ 31, 2018న ఇండిగో విమానంలో దిల్లీ నుంచి పుణెకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తమ సీటు కింద ఒక బొద్దింక ఉండటం వారు గమనించారు. దీనిని సిబ్బందికి తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే ఇందుకు సిబ్బంది నిరాకరించి.. ఈ ఘటనపై ఫిర్యాదు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో విమానం దిగిన అనంతరం బాధితులు విమానయాన సంస్థపై దిల్లీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బొద్దింక ఉన్న ఫొటోను కూడా సంస్థ అధికారులకు చూపించారు. అయితే సీటు కింద బొద్దింక ఉండటం అంత పెద్ద నేరమేమీ కాదని వారు కొట్టిపారేశారు.

దీంతో ప్రయాణికులు పుణె జిల్లా వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అనేక నోటీసులు పంపినప్పటికీ కేసు విచారణకు ఇండిగో అధికారులు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది. ప్రయాణికులకు టికెట్‌ ఛార్జీ(రూ.8574)లను తొమ్మిది శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని.. అలాగే నష్టపరిహారంగా రూ.50,000 చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని