చిలుక అరుపులకు ఇంటికొచ్చిన పోలీసులు!

పొరుగింటి నుంచి ‘హెల్ప్‌.. హెల్ప్‌’ అరుపులు విన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఇంటికొచ్చారు. తీరా విషయం తెలుసుకుని  వెనుదిరిగారు. సాయం కోసం...

Updated : 07 Jan 2020 10:22 IST

వాషింగ్టన్‌: పొరుగింటి నుంచి ‘హెల్ప్‌.. హెల్ప్‌’ అరుపులు విన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఇంటికొచ్చారు. తీరా విషయం తెలుసుకుని  వెనుదిరిగారు. సాయం కోసం అరిచింది మహిళ కాదు.. ఓ చిలుక అని తెలుసుకున్న తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటీవల జరిగిందీ ఘటన.

ఓ వ్యక్తి ఇంటి ముందు తన కారును రిపేర్‌ చేస్తుండగా పోలీసులు వచ్చారు. ఇంటి నుంచి మహిళ అరుపులు వినిపించాయని ఫిర్యాదు అందిందని తెలిపారు. వారు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఆ అరుపులు కొనసాగుతున్నాయి. దీంతో సదరు వ్యక్తి అసలు విషయం చెప్పేందుకు ఇంట్లోకి వెళ్లాడు. ఏళ్లుగా పెంచుకుంటున్న చిలుకను తీసుకొచ్చి వారి ముందుంచాడు. ఆ తర్వాత అసలు విషయం చెప్పడం మొదలు పెట్టాడు.‘‘ఈ చిలుక పేరు ర్యాంబో. నా చిన్నతనంలో దీన్నో పంజరంలో ఉంచేవారు. అప్పట్లో దానికి ‘హెల్ప్‌.నన్ను బయటకు విడిచిపెట్టండి’ అని పదాలు నేర్పించాను. కొన్నాళ్లకు దాన్ని పంజరం నుంచి విడిచిపెట్టాం. కానీ ఇది మాత్రం ఆ పదాలను మరిచిపోలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పొరుగింటి వ్యక్తి కూడా తన పనికి క్షమించాలని కోరాడు. పోలీసులు రావడం దగ్గర నుంచి వాళ్లు వెళ్లేంత వరకు జరిగిన ఘటనంతా ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియో సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని