గల్లా జయదేవ్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసు అందజేశారు. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

Updated : 07 Jan 2020 10:41 IST

గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసు అందజేశారు. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశానని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు.  నేనేమైనా హింసకు పాల్పడ్డానా? చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటుకు తాళ్లు కట్టడం హేయమైన చర్య అని ఖండించారు. రాజధాని రైతులకు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్దే జయదేవ్‌ నిరసన తెలుపుతున్నారు. 
ఇవాళ చీకటి రోజు: జయదేవ్‌
‘‘పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. వచ్చే నాలుగేళ్లు ఎలా ఉంటుందోనని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంతియుతంగా  నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం దారుణం. ఇవాళ చీకటి రోజు. రాజధానిపై సీఎం ముందే చెప్పేశారు. సీఎం చెప్పిన విధంగానే కమిటీలు నివేదికలు ఇస్తున్నాయి. సీఎం ప్రకటనకు విరుద్ధంగా కమిటీల నివేదకలు ఇచ్చే పరిస్థితి ఉండదు’’ అని జయదేవ్‌ అన్నారు. 

చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును, విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గృహనిర్బంధంలో ఉంచారు. తెదేపా నేతలు ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. చినకాకాని గ్రామంలో నిరసనకార్యక్రమంలో పాల్గొనే వారికోసం .. దాదాపు  2000వేల మందికి సరిపడా భోజనం తయారు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని