టెహ్రాన్‌లో కూలిన విమానం

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 180 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఉక్రెయిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖొమైనీ

Updated : 08 Jan 2020 12:15 IST

ఇరాన్‌ : ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 176 మంది ప్రయాణికులు, సిబ్బందితో కీవ్‌ వెళ్తున్న ఉక్రెయిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం కుప్పకూలింది. టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖొమైనీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా విమానంలో ఉన్న 176 మంది సజీవదహనమైనట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. మృతుల్లో 167 మంది ప్రయాణికులు కాగా.. 9 మంది సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ వెంటనే విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ఇరాన్‌ మీడియా చెబుతోంది. 

విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు వీడియో ఫుటేజ్‌లో తెలుస్తోంది. ఘటనలో విమానం పూర్తిగా కాలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదంపై బోయింగ్‌ సంస్థ స్పందించింది. ఇరాన్‌ మీడియా కథనాల ద్వారా ప్రమాదం గురించి తెలుసుకున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రమాదాన్ని ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది. ఘటనలో విమానంలోని వారంతా మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. 

కాగా.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసిన కొద్ది గంటలకే ఈ విమాన ప్రమాదం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ ప్రమాదవశాత్తూ కూల్చి ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని